సిరిసిల్లకు మెగా పవర్​ లూమ్​ క్లస్టర్​ ఇవ్వండి : కేటీఆర్​

‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో సిరిసిల్ల చేనేత కార్మికుడు యెల్ది హరిప్రసాద్‌ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించడంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. సిరిసిల్ల నేతన్నలపై ప్రధానికి నిజంగా ప్రేమ ఉంటే.. ఇక్కడ చేనేత రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న వారందరికీ  బహుమతిగా మెగా పవర్​ లూమ్​ క్లస్టర్​ ను మంజూరు చేయాలని కోరారు. దీని ఏర్పాటుకు సంబంధించి 2023 బడ్జెట్​లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని కూడా పూర్తిగా ఎత్తివేయాలని కోరారు. చేనేత కార్మికుడు హరిప్రసాద్​ కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోడీ చేసిన ట్వీట్ ను తన పోస్ట్​ లో ట్యాగ్​ చేశారు. 


 
జీ-20 సమావేశాల లోగోను హరిప్రసాద్‌ తన చేతితో స్వయంగా నేసి ప్రధాని మోడీకి పంపించారు. దీన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని మన్​ కీ బాత్​లో ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణలోని ఒక జిల్లాలో కూర్చున్న వ్యక్తి కూడా జి-20 వంటి శిఖరాగ్ర సదస్సుతో... ఎంతగా అనుసంధానమయ్యాడో చూసి తాను చాలా సంతోషించానని మోడీ చెప్పారు.