సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేసున్నారు: కేటీఆర్

సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేసున్నారు:  కేటీఆర్
  • టైగర్ కౌశిక్ భాయ్..
  • పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని మెచ్చుకున్న కేటీఆర్ 
  • ఇంటికెళ్లి ఆత్మీయ ఆలింగనం 

గచ్చిబౌలి, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య ఘర్షణ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ కొండాపూర్ లోని కౌశిక్ ఇంటికి వెళ్లిన ఆయన.. ‘టైగర్ కౌశిక్ భాయ్’ అంటూ మెచ్చుకుని, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. 
 

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యేల మీద దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘‘10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి సీఎం రేవంతే కండువాలు కప్పారు. కానీ హైకోర్టు తీర్పు తర్వాత పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తప్పవని తెలిసి.. స్వరం మార్చి కొత్త డ్రామాలకు తెరలేపారు. పార్టీ మారానని బహిరంగంగా ప్రకటించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్ చేశారు. నిన్నటి వరకు కాంగ్రెస్ విధానాలు నచ్చి పార్టీ మారానని చెప్పిన ఎమ్మెల్యే గాంధీ.. నేడు పదవి పోతుందని తాను పార్టీ మారలేదని కొత్తరాగం ఎత్తుకున్నారు. దీనిపై ప్రశ్నించిన మా పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద దాడి చేశారు. గేటెడ్ కమ్యూనిటీ గేట్లు బద్దలు కొట్టి, ఫ్యాక్షన్ తరహా చర్యలకు పాల్పడుతున్నా పోలీసులు కళ్లప్పగించి చూశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇలా గూండాగిరి జరుగుతుంటే, శాంతిభద్రతలను పట్టించుకునేసోయి ముఖ్యమంత్రికి లేదు. అసలు రాష్ట్రంలో హోంమంత్రి, ముఖ్యమంత్రి ఉన్నారా?’’ అని ప్రశ్నించారు.  

డీజీపీ స్పందించకపోతే కోర్టుకెళ్తాం..  

ఎమ్మెల్యే ఇంటి మీదికి గూండాలను పంపించిన హీన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డిది అని కేటీఆర్ మండిపడ్డారు. గూండాలను దగ్గరుండి కౌశిక్ రెడ్డి ఇంటికి మీదికి తీసుకొచ్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై డీజీపీ స్పందిచకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో? చెప్పాలంటూ శేరిలింగంపల్లి ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ‘‘గత పదేండ్లలో ఎప్పుడూ ప్రాంతీయ విభేదాలు రాలేదు. అభివృద్ధి, సంక్షేమం మీదే దృష్టిసారించాం. కానీ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేదని హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ కక్ష కట్టారని, అందుకే హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.