నల్గొండ, వెలుగు : రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ఎజెండా మున్సిపల్అధికారులకు కునుకు లేకుండా చేస్తోంది. కేటీఆర్ చెప్పిన 10 పాయింట్లలో ఇప్పటికే ప్రారంభించిన పలు కార్యక్రమాలు ఫండ్స్ లేక ముందుకు కదలడంలేదు. ఈ స్థితిలో మార్చి 31వ తేదీలోగా అన్ని పనులు ఎలా పూర్తి చేయాలో తెలియక ఆఫీసర్లు టెన్షన్ పడుతున్నారు. మునుగోడులో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో కేటీఆర్బల్దియాలకు పది పాయింట్ల ఎజెండా సెట్చేశారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్మార్కెట్లు, ఆధునిక దోభీఘాట్లు, మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాలు, మెగా అర్బన్ పార్క్‌లను కంప్లీట్ చేయాలని టార్గెట్పెట్టారు. మంత్రి ఎజెండాపై చర్చించేందుకు అన్ని జిల్లాల్లో మున్సిపల్కమిషనర్లతో అడిషనల్ కలెక్టర్లు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇందులోఎజెండాలో పేర్కొన్న చాలా పనులు ఫండ్స్లేక, ఇతర కారణాలతో నిలిచిపోయాయని, వీటికి తోడు మరిన్ని కొత్త పనులు చేపట్టడం సాధ్యమేనా అని అధికారులు అనుమానపడుతున్నారు. వైకుంఠధామాలు, వెజ్, నాన్వెజ్మార్కెట్ల నిర్మాణానికి డైరెక్టుగా కలెక్టర్ల ఖాతాల్లోనే ఫండ్స్జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఒకటి రెండు మున్సిపాలిటీలకు మాత్రమే ఫండ్స్వచ్చాయి. పనులు పూర్తయిన తర్వాత గానీ బిల్లులు ఇవ్వడం లేదు. పట్టణ ప్రగతి ఫండ్స్‌తో చేపట్టిన పార్కులు, జంక్షన్లు పనులు చాలాచోట్ల ఆగిపోయాయి. ప్రతి నెలా పట్టణ ప్రగతికి ఫండ్స్ ఇస్తామని చెప్పినా.. నాలుగు నెలలుగా ఈ నిధులు సరిగ్గా రావడంలేదు. మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయం కొన్ని చోట్ల ఉద్యోగులకు జీతాలకు కూడా చాలడంలేదని, ఈ పరిస్థితిలో పనులను మార్చిలోగా కంప్లీట్ చేయడం అంతా ఈజీ కాదంటున్నారు.
పట్టణాల్లో స్థలాలకు కొరత
కొన్ని జిల్లాలో కోర్టు సమస్యలు, భూతగాదాల కారణంగా వైకుంఠధామాలు, వెజ్, నాన్వెజ్మార్కెట్లు పనులు ఇప్పటికీ మొదలు పెట్టలేదు. నల్గొండ జిల్లా దేవరకొండ, చండూరు, యాదాద్రి జిల్లాలో పోచంపల్లి మున్సిపాలిటీలో స్థల సమస్య వల్ల వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాల పనులు మొదలు కాలేదు. వీటికి సంబంధించిన పనులు ఎక్కడ కూడా 30, 40 శాతానికి మించి కాలేదు. చిట్యాల, నల్గొండ మున్సిపాలిటీలకు మాత్రమే ఫండ్స్వచ్చాయి. నిధులు సకాలంలో రాక కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు శాంక్షన్ చేశారు. కానీ ఎక్కడా పనులు మొదలు పెట్టలేదు. వైకుంఠధామాలకు పెద్ద మున్సిపాలిటీలకు రూ.3 కోట్లు, చిన్న మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున ఫండ్స్ఇస్తామని సర్కార్ చెప్పింది. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల కోసం పెద్ద మున్సిపాలిటీల్లో రూ.4.50 కోట్లు, చిన్న మున్సిపాలిటీల్లో రూ.2 కోట్లు కేటాయించనున్నట్టు ప్రకటించింది. ఈ పనులకు 2021లోనే టెండర్లు కంప్లీట్ చేశారు. కానీ వర్క్ ఆర్డర్లు ఇప్పుడిప్పుడే ఇస్తున్నారు. కొత్తగా ఆధునిక దోభీఘాట్ల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేసే బాధ్యత తహసీల్దార్లకు అప్పగించారు. ఒక్కో ఘాట్‌కు అర ఎకరా స్థలం కావాల్సి ఉంది. పట్టణాల్లో తీవ్రంగా ఉన్న స్థలాల కొరత.. దోభీఘాట్లు, బయోమైనింగ్ప్లాంట్ల ఏర్పాటుకు అవరోధంగా మారనుందని అంటున్నారు.
పట్టణ ప్రగతి ఫండ్స్‌లో భారీ కోత
పట్టణ ప్రగతి ఫండ్స్‌లో మూడు, నాలుగు నెలల నుంచి సర్కార్భారీగా కోత పెడుతోంది. దీంతో జంక్షన్లు, బృహత్‌ప్రకృతి వనాల పనులు ఆపేశారు. పెద్ద మున్సిపాలిటీలకు ప్రతి నెలా రూ.1.50 కోట్లు రావాల్సిఉండగా, రూ.50 లక్షలకు మించి రావడం లేదు. 142 మున్సిపాలిటీల్లో అర్బన్ నర్సరీలు మార్చి 31లోగా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టారు. పట్టణ ప్రగతి ఫండ్స్ నుంచే గ్రీన్ బడ్జెట్ కింద పది శాతం నర్సరీలకు కేటాయిస్తున్నట్టు చెప్తున్నా నిధుల్లో కోత పెడడ్తున్నారని అధికారులు చెప్తున్నారు.
మాస్టర్ ప్లాన్ తయారీ సవాల్
మున్సిపాలిటీలు కొత్త మాస్టర్ ప్లాన్తయారు చేసుకోవాలని, మార్చిలోగా ఈ పని కంప్లీట్ చేయాలని కేటీఆర్సూచించారు. నల్గొండ వంటి గ్రేడ్ వన్మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్తయారుకాగా..ఇప్పటికీ మూడు, నాలుగు సార్లు మార్పులు, చేర్పులు చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయం కుదరక మాస్టర్ ప్లాన్ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. అనేక మున్సిపాలిటీల్లో ఇదే సమస్య ఉంది. ప్రతి ఇంటికి స్ట్రక్చర్డిజిటల్ డోర్‌నంబర్లు ఏర్పాటు చేయడం, చిన్న మున్సిపాలిటీల్లో ఆధునిక సెలూన్ల ఏర్పాటు కోసం వివరాలను సేకరించడం తదితర ఆంశాలు ఎజెండాలో ఉన్నాయి.