CM రేవంత్ హనీమూన్ పీరియడ్ క్లోజ్... ఇకపై సిన్మానే: కేటీఆర్

CM రేవంత్ హనీమూన్ పీరియడ్ క్లోజ్... ఇకపై సిన్మానే: కేటీఆర్

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ అయిపోయిందని.. ఇకపై సినిమా చూపిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం దాస్యనాయక్ తండాలో శనివారం (ఫిబ్రవరి 1) అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలు పుణికుపుచ్చుకున్న నాయకుడు కేసీఆర్ అని.. ఆర్టికల్ 3 ఆధారంగా శాంతియుత మార్గంలో పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. రిజర్వేషన్లు మాత్రమే కాదు..1952 లో ఆడబిడ్డలకు ఓటు కలిగించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. 

లగచర్లలో భూములివ్వం అని కొట్లాడే హక్కు కల్పించింది కూడా దాదాసాహెబ్ అంబేద్కరేనని అన్నారు. పరిగి నియోజకవర్గంలో 52 గిరిజన తాండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‎దేనన్నారు.  బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకుపోయిందన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి టకీ టకీ మని రైతు భరోసా పడుతుంది అన్నాడు.. ఎవరికైనా పడ్డాయా..? తులం బంగారం, స్కూటీలు‌, స్కాలర్ షిప్‎లు టకీ టకీమని ఇస్తామన్నాడు.. ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. 71 ఏళ్ల కేసీఆర్‎ను పట్టుకొని సక్కగా నిలబడు అంటూ సీఎం రేవంత్ ఎద్దేవా చేశాడు. కేసీఆర్ నిలబడకపోవచ్చు.. కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలను దేశంలో అత్యున్నత  స్థానంలో నిలబెట్టాడని కౌంటర్ ఇచ్చారు. 

ALSO READ | బడ్జెట్‎లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. పార్లమెంట్‎లో కేంద్రాన్ని నిలదీస్తాం: CM రేవంత్

కేసీఆర్ అంటే హిస్టరీ.. రేవంత్ అంటే లాటరీ అంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ అసెంబ్లీ‎కి వచ్చుడు కాదు.. దమ్ముంటే లగచర్లకు సెక్యూరిటీ లేకుండా రా.. లేదంటే నేను కొడంగల్ వస్తా.. నన్ను పోలీసులతో ఆపకు అంటూ సీఎం రేవంత్‎కు సవాల్ విసిరారు. కనీసం అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు కూడా రావడానికి అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. ఎలక్షన్ కంటే ముందు నువ్వు సిరిసిల్ల వస్తే మేం ఆపినమా.. నువ్వు బూతులు తిడితే ఏమన్న అన్నమా అని నిలదీశారు. ప్రభుత్వ అధినేతలు ఆజమాయిషీ చేస్తే ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. అనుముల రేవంత్ రెడ్డి కాదు.. రేవంత్ అబద్దాల ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

 రాష్ట్రంలోని ఒక్కో రైతుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం  రూ.17,500  బాకీ ఉంది. లోకల్ ఎలక్షన్లు ఉన్నాయి.. అందుకే రైతు భరోసా అంటూ నాటకాలు చేస్తున్నారు. ఓటు అడగడానికి వస్తే మీకు బాకీ ఉన్న డబ్బులు అడగండని రైతాంగానికి సూచించారు. జైల్లో ఉన్న హీర్యా నాయక్ అనే రైతుకు గుండెనొప్పి వస్తే బేడీలు ఏసీ తీసుకపోయిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని విమర్శించారు. మన అందరికీ అండగా కేసీఆర్ ఉన్నారని... అవసరమైనప్పుడు ఆయనకు బయటకు వస్తాడని.. ఇ కాంగ్రెసోళ్ళ భరతం పడతాడని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.