
హనుమకొండ, వెలుగు : ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక విషయంలో మంత్రి కేటీఆర్ మాటలు సరికాదని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ డిమాండ్ చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని విద్యానగర్‌తో పాటు పలువురు యువకులు సోమవారం బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం రావు పద్మ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు.
ప్రవళిక ఆత్మహత్యకు సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం చేయడం వల్లే నిరుద్యోగులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మధుచంద్ర యాదవ్, నాయకులు సారంగపాణి, శివకల్యాణ్, అభిషేక్, ప్రశాంత్, వెంకటరమణ పాల్గొన్నారు.