అది ఎన్​డీఎస్​ఏ రిపోర్ట్​ కాదు.. ఎన్డీయే రిపోర్ట్ : కేటీఆర్​

అది ఎన్​డీఎస్​ఏ రిపోర్ట్​ కాదు.. ఎన్డీయే రిపోర్ట్ : కేటీఆర్​
  • మా సభను అడ్డుకునేందుకే ఇప్పుడు ఇచ్చారు: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీపై ఇచ్చింది ఎన్​డీఎస్​ఏ రిపోర్ట్​ కాదని.. అది ఎన్డీయే రిపోర్ట్​ అని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ఈ రిపోర్టు బీజేపీ రాసిన కట్టుకథ అని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగింది కేవలం ఒక్క పిల్లరేనన్నారు. ఘటన జరిగిన వెంటనే ఆగమేఘాల మీద దిగిపోయిన ఎన్​డీఎస్​ఏ.. ఎస్​ఎల్​బీసీ టన్నెల్, సుంకిశాల రిటైనింగ్ ​వాల్​ కూలినా, వట్టెం పంప్​హౌస్​ మునిగినా, పెద్దవాగు కొట్టుకుపోయినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్​ కుమ్మక్కు రాజకీయాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 

శుక్రవారం ఆయన నందినగర్​లోని తన నివాసంలో మీడియాతో చిట్​చాట్​ చేశారు. ఎన్​డీఎస్​ఏ రిపోర్టు ఇప్పుడే రాలేదని, నిరుడు డిసెంబర్​లోనే వచ్చిందని చెప్పారు. 4 నెలలు తొక్కిపెట్టి ఇప్పుడే ఆ రిపోర్టును ఎందుకు రిలీజ్​ చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు వరంగల్​లో బీఆర్​ఎస్​ సిల్వర్​ జూబ్లీ సభ ఉండడంతో కావాలనే రిలీజ్​ చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్​ ఒక్కటే పేరు మార్చుకోలేదని.. కాంగ్రెస్​, బీజేపీ కూడా మార్చుకున్నాయఅన్నారు. కాంగ్రెస్​ ఐ అని, ఇందిరా కాంగ్రెస్​ అని, రెడ్డి కాంగ్రెస్​ అని మార్చుకున్నాయని గుర్తుచేశారు. ‘‘భవిష్యత్తు​ కూటమి ప్రభుత్వాలదేనని భావించాం. అందుకే దేశంలో మరో 25 నుంచి 30 ఎంపీ సీట్లు గెలిస్తే ప్రభావం చూపించగలమని అనుకొని పేరు మార్చాం. ముందు రాష్ట్రంలో మేం కోల్పోయిన అధికారాన్ని చేజిక్కించుకోవడమే మా లక్ష్యం’’ అని ఆయన పేర్కొన్నారు. 

కాంగ్రెస్​తోనే మా పోటీ

రాష్ట్రంలో తమకు కాంగ్రెస్​తోనే పోటీ అని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీకి బలం లేదని,  తమకు ఎప్పటికీ పోటీ కాదన్నారు. ఆ పార్టీ 8 మంది ఎంపీలలో బండి సంజయ్, రఘునందన్​ రావు, ఈటల రాజేందర్, అర్వింద్​ను అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ ఓడించిందని చెప్పారు. మోదీ చరిష్మాతో గాలివాటంగా ఎంపీలుగా గెలిచారే తప్ప వారికి సొంత బలం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టినా బీఆర్ఎస్​ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్​ఎంసీ ఎన్నికలు డిసెంబర్​లో పెడితే పోటీకి సిద్ధంగా ఉన్నామన్నారు. 

ప్రతిపక్షంలో ఉన్నట్టు వాళ్లే మాట్లాడుతున్నరు

అధికారంలో ఉన్నోళ్లే ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారని కేటీఆర్​ విమర్శించారు. కేసీఆర్​లాంటి వాళ్లు ప్రతిపక్షంలో ఉండకూడదని, అధికారంలోనే ఉండాలని అన్నారు. ‘‘14 నెలల్లో మాకు తగిలిన దెబ్బలు మామూలువి కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఆ తర్వాత కేసీఆర్​కు ఫ్రాక్చర్​ అయి ంది. కవిత అరెస్ట్​.. పార్లమెంట్​ ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఇలా ఎన్నో దెబ్బలు తిన్నాం. లగచర్ల ఘటనపై ఎన్​హెచ్​ఆర్సీ నోటీసులు, హెచ్​సీయూ భూములపై సుప్రీంకోర్టు ఎంపవర్డ్​ కమిటీ రిపోర్టు మా విజయం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తామంటే.. తీసుకునేది లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కేసీఆర్​ కూడా వాళ్లను తిరిగి తీసుకోరు’’ అని చెప్పారు. మరోవైపు, బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోమన్నారు. ప్రస్తుతం మోదీ, బీజేపీ ప్రభ తగ్గిపోతున్నదని, రాబోయే రోజుల్లో ఇంకా తగ్గిపోతుందని తెలిపారు.