ఏడాదిలోనే పంటలను ఎండబెట్టింది : కేటీఆర్​

ఏడాదిలోనే పంటలను ఎండబెట్టింది : కేటీఆర్​
  • ఏపీ నీటిని దోచుకెళ్తున్నా.. సర్కారు, బోర్డులో చలనం లేదు: కేటీఆర్​

హైదరాబాద్​, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం ఏర్పడిన రాష్ట్రంలో ఒక్కొక్కటిగా అన్నింటినీ కాంగ్రెస్ సర్కారు గంగలో కలుపుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కృష్ణా, గోదావరి నదుల నీటితో తాము బీడు భూములను సస్యశ్యామలం చేస్తే.. కాంగ్రెస్ సర్కారు ఏడాదిలోనే పంట పొలాలను ఎండబెట్టిందని ఆదివారం ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. గాలి మోటార్​లో ఢిల్లీ ట్రిప్పులు కొడుతున్న సీఎంకు అన్నదాతల గోస ఏం తెలుస్తుందని మండిపడ్డారు. ఏపీ యథేచ్ఛగా కృష్ణా నీటిని తరలించుకుపోతున్నా రాష్ట్ర సర్కారు, కృష్ణా బోర్డు చోద్యం చూస్తున్నాయన్నారు. సాగర్, శ్రీశైలంలో నీళ్లు అడుగంటుతున్నా స్పందించడం లేదన్నారు. 

బీఆర్ఎస్ పదేండ్ల పాలన తర్వాతామిగులు రాష్ట్రమే 

స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 2014 నుంచి 2024 వరకు కేవలం పదేళ్లలోనే రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కే లేదని కేటీఆర్​ అన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రానికి రూ.70 వేల కోట్ల అప్పు ఉందన్నారు. అలాగే బీఆర్ఎస్ పదేండ్ల పాలన తరువాత కూడా తెలంగాణను మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్ కు అప్పజెప్పామన్నారు.

 అప్పులను, మిగులు బడ్జెట్ తో ముడిపెట్టడం సమంజసం  కాదన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు బహిరంగ లేఖ రాశారు. మరోవైపు, కాంగ్రెస్​ ఏడాది పాలనలో గురుకులాలు అస్తవ్యస్తమై అధ్వాన స్థితికి చేరాయని విమర్శించారు. కేసీఆర్ గుర్తులు లేకుండా చేయాలన్న సంకుచిత మనస్తత్వంతోనే వాటిని రేవంత్ రెడ్డి ఖతం పట్టిస్తున్నారని మండిపడ్డారు.