
- చావులో డప్పుకొట్టినట్టుగాప్రసంగం ఉంది
- గవర్నర్నూ కాంగ్రెస్ సర్కారుమోసం చేసింది
- ప్రభుత్వానికి విజన్ లేదు.. అంతటా20% కమీషన్ నడుస్తున్నదని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదని, గాంధీభవన్లో కాంగ్రెస్ కార్యకర్త ప్రెస్మీట్లా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ సర్కారు గవర్నర్తో అబద్ధాలు, అర్ధసత్యాలను చెప్పించి ఆయన స్థాయిని దిగజార్చిందని విమర్శించారు. గవర్నర్ ప్రసంగం పెండ్లి, చావులో డప్పు కొట్టినట్టు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్నూ మోసం చేసిందన్నారు.
బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. ప్రభుత్వానికి విజన్ లేదని, 20 శాతం కమీషన్ పై నడుస్తున్నదని మండిపడ్డారు. దేశంలోని ఏ రాష్ట్ర సచివాలయంలోనూ జరగని ఘోర సంఘటన ఇక్కడి సచివాలయంలో జరిగిందని, 20 శాతం కమీషన్ లేకుంటే బిల్లులు ఇవ్వట్లేదంటూ కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్ ముందే ధర్నా చేశారని అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలపై ప్రసంగంలో స్పష్టతనిస్తారని ఆశించినా అలాంటిదేమీ జరగలేదన్నారు. కాంగ్రెస్ సర్కారు వైఫల్యంతో రైతులు అరిగోసపడుతున్నారని, 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా గవర్నర్ ప్రసంగంలో ఆ కుటుంబాలకు భరోసానిచ్చే ఒక్క మాట కూడా లేదన్నారు. రుణమాఫీ ఎక్కడా 25 నుంచి 30 శాతం కూడా పూర్తికాలేదని, దానిపైనా అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు.
రైతుబంధు సాయం అందకముందే, రైతులకు, రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తున్నామని చెప్పించారన్నారు. కేసీఆర్పై గుడ్డిద్వేషంతో మేడిగడ్డ బ్యారేజీని 15 నెలల నుంచి రిపేర్ చేయకుండా ఎండబెట్టడంతో గోదావరి బేసిన్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. రేవంత్ చేతగానితనంతో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు పొలాల్లో గొర్లు, బర్లు మేపుతున్నారని అన్నారు. కులగణన పేరుతో బీసీలను మోసం చేశారన్నారు. దానిని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీని సస్పెండ్ చేశారని విమర్శించారు.