కాంగ్రెస్ పాలనలో పల్లెలు కన్నీళ్లు పెడుతున్నయ్​ : కేటీఆర్

కాంగ్రెస్ పాలనలో  పల్లెలు కన్నీళ్లు పెడుతున్నయ్​ : కేటీఆర్
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాలనలో ఉద్యమ నినాదాలను నిజం చేయడమేకాకుండా.. గ్రామస్వరాజ్యం కోసం మహాత్ముడు కన్న కలల్ని మాజీ సీఎం కేసీఆర్​ సాకారం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సమైక్యపాలనలో దశాబ్దాలపాటు దగాపడ్డ పల్లెలను.. దర్జాగా కాలర్ ఎగరేసుకునే స్థాయికి తీర్చిదిద్దిన సందర్భాలు అపూర్వమని గురువారం ఎక్స్​లో పేర్కొన్నారు. కేసీఆర్​ హయాంలో పదేండ్లు మురిసిన పల్లెలు.. కాంగ్రెస్ పాలనలో కన్నీళ్లు పెడుతున్నాయన్నారు. గ్రామ స్వరాజ్యం పూర్తిగా గాడి తప్పిందన్నారు. 

ఏడాదిన్నర గడిచినా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవని, 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదని, గ్రామాల్లో కనీస వసతులు, గుక్కెడు మంచినీళ్లు దిక్కు లేకుండా పోయాయని విమర్శించారు. పంచాయతీ సిబ్బందికి జీతాలు, ఉపాధి హామీ కూలీలకు పనిదినాలు లేవని, మాజీ సర్పంచుల బిల్లులకూ మోక్షం రావడం లేదని అన్నారు. ఢిల్లీ పార్టీలను నమ్మిన పాపానికి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన తీరును తెలంగాణ పల్లె ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీకి, పచ్చని పల్లెలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రుగాల్చి వాతపెడతారన్నారు.