- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: సుంకిశాల ఘటనపై విజిలెన్స్ రిపోర్టును సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా సర్కారు తొక్కిపెడ్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. ‘‘ఓ నిర్మాణ సంస్థ చేసిన తప్పును దేశ రక్షణకు సంబంధించిన సమాచారహక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచేయడం దారుణం.. విడ్డూరం. మేఘా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలన్న కమిటీ రిపోర్ట్‌ను మేఘా కృష్ణారెడ్డికి, సీఎం రేవంత్‌రెడ్డికి మధ్య జరిగిన చీకటి ఒప్పందం వల్లే ప్రభుత్వం రహస్యంగా ఉంచుతున్నది.
సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్ వాల్ కూలి రూ. 80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లింది. హైదరాబాద్‌లో పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి గండిపడింది. నిర్మాణ లోపం బయట పడుతుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ సర్కారు జంకుతున్నది. సమాచారాన్ని దాచడం అంటే జరిగిన తప్పును ఒప్పుకున్నట్టే” అని శనివారం ఆయన ట్వీట్ చేశారు.