కాంగ్రెస్​.. కరోనా కన్నా డేంజర్​ : కేటీఆర్

కాంగ్రెస్​.. కరోనా కన్నా డేంజర్​ : కేటీఆర్

అసమర్థ సీఎం.. ఆర్థిక వృద్ధికి పాతరేశారు: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కరోనా వైరస్ కన్నా డేంజర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఏడాది కింద చెప్పిన మాట.. ఇప్పుడు అక్షరాలా నిజమైందని సోమవారం ఎక్స్​లో పోస్ట్ చేశారు. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యి తీసి పాతరేశారని, దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణను ఆఖరుకు చేర్చారని ఆరోపించారు. ‘‘నిరుడు జీఎస్టీ వసూళ్లు 10 శాతం నమోదైతే.. ఇప్పుడు కేవలం ఒక్క శాతానికి పడిపోవడం సిగ్గుచేటు. మతిలేని సీఎం చెత్త నిర్ణయాలు, ఘోర తప్పులతోనే రాష్ట్రం ఆర్థిక విధ్వంసం భారిన పడి సంక్షోభంలోకి పోతున్నది.

ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని తాకుతుంటే.. పెట్టుబడులు మాత్రం కుప్పకూలడం క్షమించరాని నేరం. కేసీఆర్​ పదేండ్ల స్వర్ణయుగాన్ని చెరిపేస్తున్న సీఎం.. చీకటి చరిత్రను రాస్తున్నారు’’ అని కేటీఆర్​ మండిపడ్డారు. మరోవైపు ఎస్ఎల్​బీసీలో సెంటీమీటర్ సొరంగమైనా తవ్వడం చేతగాని సీఎం.. 12 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేసిన బీఆర్ఎస్​పై నిందలు వేయడం సిగ్గుచేటని కేటీఆర్ ‘ఎక్స్’ ​చేసిన మరో పోస్ట్​లో విమర్శించారు. ప్రణాళిక లేకుండా పనులు మొదలుపెట్టి, నాలుగు రోజులు కాకముందే ఎనిమిది మంది ప్రాణాలను ఫణంగా పెట్టిన పాపం ముఖ్యమంత్రిదేనని ఆరోపించారు.