ఏడాది పాలనలో ఏ పేజీ తిప్పినా మోసం,అవినీతే : కేటీఆర్

ఏడాది పాలనలో ఏ పేజీ తిప్పినా మోసం,అవినీతే : కేటీఆర్
  • రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏ పేజీ తిప్పినా మోసం, అవినీతి, నియంతృత్వమే కనిపిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మనసులో విషం నింపుకున్న సీఎం చేతిలో తెలంగాణ బతుకు ఛిద్రమవుతుంటే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని ఆరోపించారు. బుధవారం ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు.

గాలిమోటార్​లో వచ్చి గాలిమాటలు చెప్పారని, ఏడాదిపాటు పత్తా లేకుండా పోయారని రాహుల్​పై విమర్శలు చేశారు. రైతన్నకు కాంగ్రెస్ సర్కారు వెన్నుపోటు పొడిచిందని లేఖలో విమర్శించారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న మాటలు నీటి మూటలే అయ్యాయన్నారు. నాలుగు విడతల్లో రుణమాఫీ చేశారన్నారు. 

అన్ని పేర్లూ మారుస్తం

ఉద్యమంలో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లి దివ్య రూపాన్ని అవమానించి.. ప్రజలపై కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దేందుకు రేవంత్​ ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి సంస్థ పేరును మార్చి తీరుతామన్నారు.

సెక్రటేరియెట్ బయట ఉన్న రాజీవ్​గాంధీ, సెక్రటేరియెట్​లోని తెలంగాణ తల్లి విగ్రహాలను తొలగిస్తామన్నారు. ‘‘ఎన్నికల ప్రచారంలో ఆడబిడ్డలకు అరచేతిలో వైకుంఠం చూపించి నిలువునా మోసం చేశారు. అరకొరగా నడిచే ఫ్రీ బస్సు స్కీమ్ తప్ప మహిళలకు ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదు. పింఛన్లు పెంచలేదు. హైడ్రా, మూసీ పునరుజ్జీవం పేరిట కాంగ్రెస్ సర్కారు కూల్చివేతలకు కేరాఫ్ గా మారింది’’ అని పేర్కొన్నారు.