సమస్యల సుడిగుండంలో హైదరాబాద్..కష్టాలకు కేరాఫ్​గా మారింది: కేటీఆర్​

సమస్యల సుడిగుండంలో హైదరాబాద్..కష్టాలకు కేరాఫ్​గా మారింది: కేటీఆర్​

 

  • హైదరాబాద్ ​బ్రాండ్​ ఇమేజ్​ను కాపాడడంలో కాంగ్రెస్​ విఫలం
  • తలసాని ఇంట్లో గ్రేటర్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి గుండెకాయ అయిన హైదరాబాద్..​ ఏడాదికాలంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నదని బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. రేవంత్​ పాలనలో సవాలక్ష కష్టాలకు కేరాఫ్​గా మారిందన్నారు. హైదరాబాద్ ​బ్రాండ్​ ఇమేజ్​కాపాడాలన్న సోయి ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. మంగళవారం తలసాని శ్రీనివాస్​యాదవ్​నివాసంలో బీఆర్ఎస్​ఎమ్మెల్సీలు, గ్రేటర్​హైదరాబాద్​ఎమ్మెల్యేలతో కేటీఆర్​సమావేశమయ్యారు.

నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి వెళ్లినా కాంగ్రెస్ పాలనలో ఎదుర్కొంటున్న దురావస్థల గురించే హైదరాబాదీలు చెప్తున్నారని కేటీఆర్​కు ఎమ్మెల్యేలు వివరించారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఏడాది కాలంగా పేదలు ఎదురు చూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ రూపురేఖల్ని సమూలంగా మార్చామని కేటీఆర్​ అన్నారు. వందేండ్ల ముందుచూపుతో ఫ్లైఓవర్లను నిర్మించామని చెప్పారు.  

ప్రస్తుత ప్రభుత్వానికి తాము నిర్మించిన కట్టడాలు, నిర్మాణాల నిర్వహణ కూడా చేతకావడం లేదని విమర్శించారు. దెబ్బతిన్న రోడ్లను కనీసం రిపేర్ చేయకపోవడంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. రేవంత్​ పాలనపై హైదరాబాద్​ ప్రజలకు నమ్మకం లేదన్నారు. కేసీఆర్​ హయాంలో హైదరాబాద్​లో శాంతి భద్రతలు చెక్కుచెదరలేదని.. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు.  

తెలంగాణ గ్రోత్ ఇంజన్​ను కాపాడుకోవాలి..

తెలంగాణ గ్రోత్ ఇంజన్​ను కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కేటీఆర్​ సూచించారు. గ్రామసభలు, వార్డు సభల పేరిట మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ రేషన్ కార్డులు, ఇండ్లు, పింఛన్లు ఇవ్వాలని.. లేకపోతే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

 సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్​ యాదవ్​.. రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. హైదరాబాద్​ మేయర్​పై అవిశ్వాసంతో పాటు కాంగ్రెస్​ ఇచ్చిన హామీలపై చర్చించామన్నారు. కాంగ్రెస్​ గీత దాటితే తాము కూడా దాటాల్సి వస్తుందన్నారు. లంచ్​ మీటింగ్​ అని, రెండు మూడు గంటల పాటు అన్ని అంశాలూ చర్చకు వచ్చాయని అన్నారు. 

మేయర్​పై అవిశ్వాసం!

కేటీఆర్, హైదరాబాద్​ ఎమ్మెల్యేల మీటింగ్​లో గ్రేటర్​ హైదరాబాద్​ మేయర్​ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టే అంశంపై చర్చించినట్టు తెలిసింది.  అవిశ్వాసానికి ఎంత మంది అవసరమనే అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. 2020లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు జరగ్గా.. ఎంఐఎం మద్దతుతో బీఆర్ఎస్​ మేయర్​ పీఠాన్ని దక్కించుకుంది. గద్వాల విజయలక్ష్మిని మేయర్​గా చేశారు.

అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్​ నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, ఈ ఏడాది చివరి నాటికి జీహెచ్​ఎంసీ పదవీ కాలం ముగియనుంది. గత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్​ రెండే స్థానాలు గెలవగా.. ప్రస్తుతం కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరడంతో సంఖ్యా బలం 19కి పెరిగింది.