మేం అధికారంలో ఉన్నప్పుడూ భూములు అమ్మినం

మేం అధికారంలో ఉన్నప్పుడూ  భూములు అమ్మినం
  • పన్నేతర ఆదాయం కోసం ప్రభుత్వాలకు ఇది తప్పదు ​
  • హెచ్‌‌‌‌సీయూ ల్యాండ్స్​ వ్యవహారం దేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌ వ్యాఖ్యలు

కరీంనగర్, వెలుగు: తాము అధికారంలో ఉన్నప్పుడు భూములు అమ్మామని.. అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకంటే ముందున్న టీడీపీ ప్రభుత్వం కూడా  అమ్మాయని..  పన్నేతర ఆదాయం కోసం ఏ ప్రభుత్వానికైనా భూములు అమ్మక తప్పదని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ అన్నారు. ప్రజలపై పన్నులు వేయలేమని, పన్నేతర ఆదాయమే పెంచుకోవాలని, సంపద ప్రజలకు పంచాలని పేర్కొన్నారు. శనివారం కరీంనగర్‌‌‌‌ చింతకుంటలోని బీఆర్​ఎస్​ జిల్లా ఆఫీసులో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు సంజయ్, కౌశిక్‌‌‌‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

 ‘మేం బ్రోకరేజీ సంస్థలకు కమీషన్లు ఇచ్చి భూములు అమ్మలేదు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ద్వారా మాత్రమే అమ్మాం” అని కేటీఆర్​ తెలిపారు.  ‘‘హెచ్‌‌‌‌సీయూ భూముల తనఖా దేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్​. తమది కాని భూమిని తనఖా పెట్టడం ఫ్రాడ్ కాదా? మార్టిగేజ్ చేసేందుకు బాంబే బ్రోకర్‌‌‌‌ను బీజేపీ ఎంపీ తీసుకొస్తే.. ఎంపీ, సీఎం ఇద్దరూ కలిసి బీకన్‌‌‌‌ అనే సంస్థకు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు లోన్‌‌‌‌ తీసుకుని కమీషన్‌‌‌‌ రూపంలో రూ.170 కోట్లు ఇచ్చారు. హెచ్‌‌‌‌సీయూ భూముల వ్యవహారంలో ఉన్న బీజేపీ ఎంపీకి ఫ్యూచర్ సిటీలో భారీ మేలు చేస్తానని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మాట ఇచ్చారు. ఆ ఒప్పందం అమలయ్యాక సదరు బీజేపీ ఎంపీ పేరు వెల్లడిస్త” అని కేటీఆర్​ దుయ్యబట్టారు. 

రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీల్లో ఒకటి చెప్పులు మోసేది అయితే.. ఇంకొకటి సంచులు మోసేది. బీఆర్ఎస్‌‌‌‌ మాత్రమే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలే సక్సెస్ అయ్యాయని.. ఇందులో ఒకటి టీడీపీ, మరొకటి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌” అని వ్యాఖ్యానించారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పేరుమారినా.. జెండా మారలేదని, ఎజెండా మారలేదని అన్నారు. ఒక్క పిల్లర్‌‌‌‌కు పర్రె పడితే మొత్తం కాళేశ్వరమే కూలిపోయినట్లు  కేసీఆర్ మీద గుడ్డి వ్యతిరేకతతో ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ఈ ఎండాకాలంలో మేడిగడ్డకు రిపేర్లు చేసి పంపింగ్ చేయాలని ఆయన డిమాండ్‌‌‌‌ చేశారు.

ఏడాది పాటు పార్టీ సంబురాలు

ఏడాదంతా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ రజతోత్సవ సంబురాలు నిర్వహిస్తామని కేటీఆర్‌‌‌‌ చెప్పారు. ‘‘రజతోత్సవ సభకు పోలీస్‌‌‌‌ పర్మిషన్‌‌‌‌ ఇవ్వకపోతే కోర్టుకు పోయినం. ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద జరిపే యుద్ధభేరి కాదు.. ప్రతి ఏడాదిలాగే నిర్వహించే వార్షికోత్సవ సభ’’ అని తెలిపారు. హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించే సభ కోసం 1200 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని, ఆర్టీసీ బస్సుల కోసం రూ.10 కోట్లు చెల్లించామని చెప్పారు. రజతోత్సవ సభ సందర్భంగా పార్టీలో మొదటి నుంచీ పనిచేసిన వారిని సన్మానిస్తామని, ప్రతిసారి నిర్వహించినట్లే ఈ సారి కూడా అధ్యక్ష పదవికి ఎన్నిక ఉంటుందని కేటీఆర్​ అన్నారు.