ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న కేంద్రం : కేటీఆర్​

ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న కేంద్రం : కేటీఆర్​
  • పెట్రోల్​పై సెస్సులు పెంచుతూ పేదల నడ్డివిరుస్తున్నది: కేటీఆర్​
  • మ్యాగ్జిమం ట్యాక్సేషన్.. మినిమం రిలీఫ్​గా మార్చేశారని ఫైర్
  • కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి బహిరంగ లేఖ

హైదరాబాద్, వెలుగు: సెస్సుల రూపంలో పెట్రోల్​ ధరలను పెంచుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. తీవ్రమైన ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నదని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను కబళిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న సెస్సులతో మౌలిక వసతులను కల్పించకుండా సొంత రాజకీయ అజెండా ప్రచారాల కోసం వినియోగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు న్యాయమైన వాటాలు ఇవ్వకుండా సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నదన్నారు. 

దేశ ఆర్థిక పురోగతికి సహకరిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలు నిధుల కొరతతో అల్లాడుతుంటే.. అక్రమంగా వసూలు చేస్తున్న సెస్సులతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తున్నదని మండిపడ్డారు. పెరిగిన పెట్రోల్​ ధరలపై బుధవారం ఆయన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పూరీకి బహిరంగ లేఖ రాశారు. ప్రపంచంలోనే పెట్రోల్​పై అధిక ధరలను వసూలు చేస్తున్న దేశంగా మన దేశం నిలిచిందని ఆరోపించారు. మినిమం గవర్నమెంట్​.. మ్యాగ్జిమమ్​ గవర్నెన్స్​అన్న కేంద్ర ప్రభుత్వ నినాదం.. ‘మ్యాగ్జిమం ట్యాకేషన్.. మినిమం రిలీఫ్​’గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్​ ధరలు రూ.1,100 దాటడంతో పేద, మధ్యతరగతి వారికి భరించలేని భారంగా మారిందని కేటీఆర్​అన్నారు. 

‘‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన ఒక క్రూరమైన జోక్ గా మారింది. ఒకప్పుడు ఉజ్వల యోజన కింద సిలిండర్లు తీసుకున్న మహిళలు.. ఇప్పుడు పెరిగిన గ్యాస్​ ధరలతో మళ్లీ కట్టెలపైనే వంట చేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రస్తుత కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలంతా గతంలో పెట్రోలియం ధరలు తగ్గించాలంటూ ఆందోళనలు చేశారు కదా అని గుర్తు చేశారు. కేంద్రం పెంచుతున్న ధరలతో పేద ప్రజల జేబులు ఖాళీ అవుతుంటే.. ఆయిల్​ కంపెనీలకు మాత్రం వేల కోట్లు వచ్చి చేరుతున్నాయన్నారు. ప్రధాని మోదీ చెప్పిన అచ్చే దిన్​అంటే బిల్లుల భారం భరించడమేనా అని కేటీఆర్​ ప్రశ్నించారు. పెంచిన ధరలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.