
- మేం అధికారంలోకి వచ్చాక వాళ్లు రిటైరైనాపట్టుకొచ్చి లెక్క సరిచేస్తం: కేటీఆర్
- పోలీసులు రేవంత్ ప్రైవేట్ సైన్యంలా మారిపోయారులగచర్ల
- ఆడబిడ్డలపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: ఓవరాక్షన్ చేస్తున్న అధికారులను వదలబోమని, తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మానవ మృగాల్లాగా, రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్న కొంత మంది పోలీసులు లగచర్ల ఆడబిడ్డలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. కామాంధుల్లాగా పోలీసులు మహిళలపై వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. హైదరాబాద్ నందినగర్‌లోని మంగళవారం కేటీఆర్ నివాసంలో లగచర్ల బంజారా మహిళలు ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఇప్పటికీ తమపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నట్లు లగచర్ల ఆడబిడ్డలు చెబుతున్నారని అన్నారు. మూడేండ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, ఓవరాక్షన్ చేస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆ అధికారులు రిటైరై ఎక్కడున్నా పట్టుకొచ్చి లెక్క సరిచేస్తామన్నారు. మహిళలను లైంగికంగా హింసించిన పోలీసులను వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ఘటనకు కర్త, కర్మ, క్రియ రేవంత్ రెడ్డి అనే అనుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఓ మనిషిని ఎన్ని రకాలుగా చిత్రవధ చేయాల్నో అన్ని రకాలుగా లగచర్ల రైతులను పోలీసులు చిత్రవధ చేశారని ఆరోపించారు.తనతో పాటు తన అత్తను కూడా పోలీసులు లైంగికంగా వేధించారని ఓ అమ్మాయి ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిందన్నారు. లగచర్ల భూసేకరణపై హైకోర్టు స్టే విధించినా.. ఇప్పటికీ ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నదన్నారు.