ఆస్తులు అమ్మడం..అప్పులు తేవడమే కాంగ్రెస్ ఎజెండా : కేటీఆర్

ఆస్తులు అమ్మడం..అప్పులు తేవడమే కాంగ్రెస్ ఎజెండా : కేటీఆర్
  • అది తప్పో, ఒప్పో ప్రజలే నిర్ణయిస్తరు
  • హెచ్​సీయూ విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటం
  • తెలంగాణ భవన్​లో హెచ్​సీయూ విద్యార్థులతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడమే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు తప్పో, ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు శ్మశానాలకు కూడా జాగాలు ఉండవు అంటూ గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడవన్నీ మర్చిపోయాడని ఎద్దేవా చేశారు. హెచ్​సీయూలో ఫుట్​బాల్ ఆడినప్పుడే రేవంత్ కన్ను ఆ భూములపై పడిందన్నారు. హెచ్​సీయూ భూముల వ్యవహారంపై ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నారు. సోమవారం హెచ్​సీయూకు చెందిన విద్యార్థులు తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిశారు. వారి పోరాటానికి అండగా ఉంటామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమ హైదరాబాద్ లో ఢిల్లీలా ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. 

ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా 400 ఎకరాలు భూమిని ఎలా అమ్ముతారని హెచ్​సీయూ విద్యార్థులు అడుగుతున్నారని, పర్యావరణ నష్టం ప్రభావంపై అధ్యయనం చేయాలి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థులు, భూములపైన రాజకీయం చేస్తున్నదన్నారు. హెచ్సీయూలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకం రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికే హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం వేశారని, కోర్టు ఆదేశాల కన్నా ముందే ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. విద్యార్థులకు అండగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వీసీ పర్మిషన్ లేకుండా పోలీసులు యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.