- కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్నే మారుస్తున్నరు
- ధనిక తెలంగాణను పేద రాష్ట్రంగా చిత్రీకరిస్తున్నారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్నే మార్చేస్తున్నారని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ‘‘దేశంలోనే అత్యంత సంపన్నమైన రాష్ట్రం తెలంగాణ. అందుకు అనుగుణంగానే తెలంగాణ తల్లికి రూపమిచ్చాం. అది ఇక్కడి ప్రజల ఆశయాలు, ఔన్నత్యం, గొప్పతనానికి చిహ్నం. కానీ సుసంపన్నమైన తెలంగాణ తల్లిని పేదరికానికి, సమస్యలకు చిహ్నంగా ప్రతిష్టించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలి. లేదంటే నాలుగేండ్ల తర్వాత మేం అధికారంలోకి వచ్చాక దాని స్థానంలో సుసంపన్నమైన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం.
రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టిన స్థానంలోనే తెలంగాణ తల్లిని ప్రతిష్టించి తీరుతాం” అని తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ పుస్తకాల ఎగ్జిబిషన్‌ను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇందిరాగాంధీ ప్రతిష్టించిన భరతమాతను వాజ్‌పేయి మార్చలేదు. దేశంలో ఎన్నోచోట్ల అధికార మార్పిడి జరిగినా ఇలాంటివి చేయలేదు” అని అన్నారు. రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లనే పెట్టామని, పార్టీ నాయకుల పేర్లను పెట్టలేదని చెప్పారు. ఏనాడూ పథకాలకు కేసీఆర్ తన పేరును పెట్టుకోవాలని అనుకోలేదని, ఆయనకు ఇష్టం లేకున్నా తామే కేసీఆర్ కిట్అని పేరు పెట్టామని తెలిపారు.
అప్పులపై కాదు.. రేవంత్ తప్పులపై చర్చ జరగాలి
రాష్ట్రంలో అప్పులపై కాదని, సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పులపై చర్చ జరగాలని కేటీఆర్అన్నారు. ‘‘11 నెలల పాలనలో అనుముల సోదరులకు మాత్రమే లాభం జరిగింది. ఇదే పరిస్థితి ఉంటే వచ్చే ఏడాది ఫోర్బ్స్‌జాబితాలో రేవంత్ సోదరులు చేరుతారు. ‘తెలంగాణ రైజింగ్’ అంటూ కొత్త నాటకానికి తెరదీశారు. అది తెలంగాణ రైజింగ్ కాదు.. అనుముల బ్రదర్స్ రైజింగ్. తెలంగాణ ఫాలింగ్.. తెలంగాణ ఫెయిలింగ్’’ అని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకునేందుకే అప్పులపై డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
11 నెలల్లో లక్ష కోట్ల అప్పు..
రేవంత్‌కు పాలన చేతకాకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని కేటీఆర్అన్నారు. కేవలం 11 నెలల్లోనే రూ.లక్ష కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వ్‌బ్యాంక్‌నుంచి రూ.85 వేల కోట్ల అప్పు తీసుకుంటే, కార్పొరేషన్లు మరో రూ.29,870 కోట్ల అప్పులు చేశాయని తెలిపారు. ‘‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. రూ.100 ఖర్చు పెడితే అందులో రూ.74 అభివృద్ధికే ఖర్చు చేస్తున్నాం. ఆదాయమంతా అప్పులకే పోతున్నదని రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నది.
రూ.100లో అప్పులకు వడ్డీ కడుతున్నది కేవలం రూ.47 మాత్రమే” అని చెప్పారు. ‘‘ప్రతి నెల అప్పులకు కిస్తీలే రూ.6,500 కోట్లు కడుతున్నామని రేవంత్పదే పదే చెబుతున్నడు. కానీ బడ్జెట్ పేపర్స్ప్రకారం నెలకు రూ.2,900 కోట్లే కడుతున్నరు. ఈ లెక్కన ఏటా కడుతున్నది రూ.34,730 కోట్లే. కాగ్ప్రకారమైతే నెలకు రూ.2,164 కోట్లే కడుతున్నారు. మరి, ఆదాయం ఎటు పోతున్నట్టు? బ్రదర్స్ జేబులోకి వెళ్తున్నదా? లేక ఏపీ జేబులోకి వెళ్తున్నదా? లేక ఢిల్లీ సంచుల్లోకి పోతున్నదా?’’ అని ప్రశ్నించారు.