- రాష్ట్ర సర్కార్‌పై కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేస్తారా అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌కు నిధులు ఇవ్వడం లేదని జీహెచ్‌ఎంసీ పాలక మండలి సమావేశంలో కాంగ్రెస్ సర్కార్‌ను తమ పార్టీ సభ్యులు ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా అని గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గతేడాది పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం ఖర్చు కూడా చేయకుండా.. మరోసారి అవే కాగితాలపైన అంకెలు మార్చి కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటున్నది.
ఆ మోసాన్ని అడ్డుకున్నందుకే మా ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా? పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస సౌలతులనూ నిర్వహించలేని అసమర్థ తీరును ప్రశ్నిస్తే ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు. హైదరాబాద్ ప్రజల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలి. అప్పటిదాకా సీఎంను, సర్కారును ప్రశ్నిస్తూనే ఉంటాం’’అని ఆయన పేర్కొన్నారు.