ఒకవైపు దూకుడు .. మరో వైపు టెన్షన్!

  • ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో రౌండ్​ చుట్టేసిన బీఆర్ఎస్​ లీడర్లు
  • సీఎం పోటీ చేస్తున్న కామారెడ్డిలో స్పెషల్​ఫోకస్​
  • వివిధ పథకాల కింద అనర్హులకు లబ్ధి చేకూర్చారంటూ స్థానికంగా ఆందోళనలు 
  • అర్హులైన వారికే దళిత బంధు లాంటి పథకాలు వర్తింపజేయాలంటూ డిమాండ్​

కామారెడ్డి, వెలుగు : అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్ఎస్​ దూకుడు పెంచింది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో ఆ పార్టీ లీడర్లు తమతమ నియోజకవర్గాల్లో ఓ రౌండ్​ చుట్టేశారు. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో లీడర్లకు నిరసన సెగలు తాకాయి. అర్హులకే వివిధ పథకాల కింద లబ్ధి చేకూర్చాలంటూ స్థానికంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా దళితబంధు కోసం అనేక చోట్ల దళితులు రోడ్కెక్కడం ఆ పార్టీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఆగస్టు 21న బీఆర్ఎస్​ అధినేత అభ్యర్థులను డిక్లేర్ చేయగా,  జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు మూడు చోట్ల పాత వారికే టికెట్లు దక్కాయి. కామారెడ్డిలో మాత్రం సిట్టింగ్​ఎమ్మెల్యేకు బదులు తాను పోటీ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.

ఎన్నికల కోడ్ ​అమల్లోకి రాకముందే నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనులపై లీడర్లు దృష్టి పెట్టారు. కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించారు. స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి, విప్​గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్​షిండే, జాజుల సురేందర్ ​అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వారం రోజుల వ్యవధిలోనే మంత్రి కేటీఆర్ ​కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో పర్యటించారు. జుక్కల్ ​నియోజకవర్గంలోని బిచ్కుందలో మంత్రి హరీశ్​రావుతో 100 పడకల హాస్పిటల్​కు శంకుస్థాసన చేసి, అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన మహ్మద్ నగర్ ​మండలాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారభించారు.

స్కీమ్​ల కోసం ఆందోళనలు..

ప్రభుత్వ పథకాల అమలు తీరు, లబ్ధిదారుల ఎంపికపై ప్రజలు లీడర్లను నిలదీస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్​ నియోజకవర్గాల్లో దళితబంధు, స్థానిక సమస్యలపై ఆందోళనలు జరిగాయి. కామారెడ్డి నియోజకవర్గంలో దళితబంధు కోసం దళితులు రోడ్కెక్కారు. ప్రతీఒకరికి స్కీమ్ ​వర్తింపజేయాలని డిమాండ్​ చేస్తున్నారు. బీబీపేట, దోమకొండ, భిక్కరూరు మండలాల్లో నిరసనలు కొనసాగాయి.

ఆయా గ్రామాల నుంచి కలెక్టరేట్​కు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గం, తాడ్వాయి మండలంలోని కరడ్​పల్లిలో దళిత బంధు కోసం స్థానికులు నిరసనకు దిగారు. జుక్కల్​ నియోజకవర్గం పిట్లం మండలంలోనూ ఆందోళనలు కొనసాగాయి. 

కామారెడ్డిపై స్పెషల్​ఫోకస్..​

కామారెడ్డి నుంచి కేసీఆర్​ పోటీ చేస్తున్న నేపథ్యంలో ముఖ్య నేతలు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నెల 7న నియోజకవర్గ కేంద్రంలో గులాబీ శ్రేణులతో భారీ సభ నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నేపథ్యంలో శ్రేణులను కో ఆర్టినేట్​చేయడానికి ముగ్గురు ఇన్​చార్జులుగా వ్యవహారించనున్నారు. మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్​రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ ఇన్​చార్జులుగా ఉంటారు.

స్థానికంగా గంప గోవర్ధన్​ఇన్​చార్జిగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మంత్రులు కూడా శ్రేణులతో మాట్లాడనున్నారు. నియోజకవర్గంలో 266 పోలింగ్​సెంటర్లకు ఒక్కో సెంటర్​కు పార్టీ సీనియర్​ నేతను బ్రిగేడియర్​గా నియమించాలని, ప్రతీ వంద మంది ఓటర్లకు ఒక ఇన్​చార్జ్​గా నియమించాలని ఎమ్మెల్యే గంప గోవర్ధన్​కు, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ముజీబోద్దీన్​కు కేటీఆర్ ​సూచించారు