- చట్టం తన పని తాను చేస్తుంది
- కలెక్టర్‌పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- తప్పు అంటాడా?మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్య
వేములవాడ, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై చట్టం తన పని తాను చేసుకుంటుందని, అరెస్ట్ చేయమని.. చేయొద్దని తాము చెప్పడం లేదని, కేంద్ర మంత్రి బండి సంజయ్ లాగా తాము మాట్లాడలేమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని కోడె మొక్కు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయం చెప్పడానికి, ప్రజలు నిరసన తెలపడానికి అవకాశం ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ పాలనలో స్వేచ్ఛ ఉందని, అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకోమన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర సర్వీస్ ఉద్యోగిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయడాన్ని తప్పు పట్టడం ఏమిటని, ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ ఉన్నందున ట్రస్టు బోర్డు వేయలేదని, బోర్డు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. అనంతరం సీఎం పర్యటన ఏర్పాట్లను వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు.