- మళ్లీ చెప్తున్నా.. ఇదో లొట్టపీసు కేసు.. ఆయనో లొట్టపీసు సీఎం
- ఏసీబీ వాళ్లు 82 ప్రశ్నలు అడిగిన్రు.. అడిగినవే మళ్లీ మళ్లీ అడిగిన్రు
- రేవంత్ బలవంతంగా కేసు పెట్టించిండని ఏసీబీ వాళ్లూ అనుకుంటున్నరు
- ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్త
- తెలంగాణ కోసం చావనైనా చస్త.. కానీ లుచ్చాగాళ్ల ముందు తలవంచ
- కేసీఆర్ పదేండ్ల పాలనలో ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పనిచేసినం
- ఏసీబీ విచారణకు ముందు, అనంతరం మీడియాతో వ్యాఖ్యలు
హైదరాబాద్, వెలుగు : ఫార్ములా –ఈ రేసులో కేసు లేదు, పీసు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘అందులో ఏమీ లేదు. ఎవరు ఏమనుకున్నా అదొక లొట్టపీసు కేసే. ఆయనో లొట్టపీసు ముఖ్యమంత్రే” అని దుయ్యబట్టారు. ఏసీబీ వాళ్ల దగ్గర ప్రశ్నలేమీ లేవని, రేవంత్ ప్రశ్నలు పంపితే మళ్లీ వాళ్లు పిలుస్తారని వ్యాఖ్యానించారు. ఏసీబీ మళ్లీ పిలిస్తే కచ్చితంగా వస్తానని చెప్పానని అన్నారు. ‘‘కాంగ్రెస్ కబంధహస్తాల్లో తెలంగాణ చిక్కుకున్నది. ఆ కబంధహస్తాల నుంచి తెలంగాణను విడిపించేందుకు పోరాడుత” అని తెలిపారు.
గురువారం ఏసీబీ విచారణ పూర్తయిన తర్వాత తెలంగాణభవన్‌లో, విచారణకు ముందు నందినగర్‌లోని తన ఇంటి వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తాను విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెచ్చి ఆ విదేశాల మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నానని, రేవంత్ రెడ్డి పైశాచికానందం కోసం తనపై కేసుల పెడుతున్నారని ఆయన అన్నారు. ‘‘హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలపాలన్నది మా నాయకుడు కేసీఆర్ సంకల్పం. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్లో, రాష్ట్రంలో భయపడేటోళ్లు ఎవరూ లేరు. అసలు ఎవరూ రేవంత్‌ను సీఎంగానే చూడడం లేదు.
ఏడాది అవుతున్నా రేవంత్‌ను సీఎంగా గుర్తుపట్టడం లేదు. అట్ల గుర్తుపట్టినివాళ్ల గురించి చెబితే మళ్లీ వాళ్లను జైలులో వేస్తరు” అని వ్యాఖ్యానించారు. ‘‘ఏసీబీ వాళ్లు పిలిస్తే మళ్లీ విచారణకు వెళ్త. రేవంత్ లుచ్చా, దొంగ అని చెప్పొస్త. ఏసీబీ వాళ్లు 82 ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగారు. రేవంత్ రెడ్డి బలవంతంగా కేసు పెట్టించారన్న విషయం వారికి కూడా అర్థమైంది. కేసులో ఎలాంటి విషయం లేకపోవడంతో ఏసీబీ వాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నరు” అని పేర్కొన్నారు.
ఫార్ములా -–ఈ ఈవెంట్‌ను తొలిసారిగా హైదరాబాద్‌కే తీసుకొచ్చామని, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు, హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నించామని ఏసీబీకి చెప్పినట్లు తెలిపారు. ‘‘అవినీతి, పైసల వంటి గలీజు పనులు రేవంత్ రెడ్డి చేస్తరేమోగానీ.. మేం చేయం.. ఆ ఖర్మ మాకు పట్టలేదని ఏసీబీ వారికి చెప్పిన. ఇట్లాంటి కేసులు వంద పెట్టినా, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్త” అని తెలిపారు.
కొట్లాడ్తనే ఉంటం
కేసీఆర్ పదేండ్ల పాలనలో ఒక్క పైసా అవినీతి లేకుండా పనిచేశామని కేటీఆర్ అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ సైనికులుగా ఈ ఏడాది మొత్తం ప్రజల సమస్యలు, ప్రజల గురించే కొట్లాడుతామని తెలిపారు. ‘‘నిఖార్సయిన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డగా తెలంగాణ కోసం చావనైనా చస్తానుగానీ.. రేవంత్ లాంటి లుచ్చాగాళ్ల ముందు తలవంచ. ఒక్క పైసా అవినీతి చేయలేదు. చేయబోను. తెలంగాణ కోసం పోరాటం చేసిన కార్యకర్తగా.. కేసీఆర్ సైనికుడిగా.. స్వచ్ఛమైన మనసుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయం చేయడానికే ఫార్ములా –ఈ రేసును నిర్వహించాం.
పదేండ్లు మేం అధికారంలో ఉన్నప్పుడు మా బామ్మర్దులకు 1137 కోట్ల కాంట్రాక్టులు ఇవ్వలేదు. మంత్రిగా కేబినెట్‌లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు. కాంట్రాక్టులిచ్చి నేనేమీ ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ చావు తెలివితేటలు రేవంత్ రెడ్డి, ఆయన సహచర మంత్రులకే సాధ్యం. ఇవాళ కొంతమంది అర్థమైకాని వాళ్లు.. తెలిసీ తెలియనివాళ్లు.. బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు. రాజకీయపబ్బం గడుపుతున్నరు. అయినా కొట్లాడుతూనే ఉంటం. విద్యుత్ చార్జీలు పెంచొద్దని ఏడాది నుంచి కొట్లాడింది బీఆర్‌ఎస్.
లగచర్ల రైతులను అరెస్ట్ చేయొద్దని కొట్లాడింది బీఆర్‌ఎస్. హైడ్రా పేరుతో కూలగొడితే అడ్డుకున్నది బీఆర్‌ఎస్. నామీద కేసు పెట్టి మా పార్టీ.. మా కేడర్ దృష్టి మళ్లించాలనుకుంటున్నవ్.. అది నీ వల్ల కాదు రేవంత్ రెడ్డి. ఒకటి కాదు.. వంద కాదు.. వెయ్యి కేసులు పెట్టినా నీ 420 హామీలపై నిలదీస్తూనే ఉంటం. న్యాయపరంగా కొట్లాడుతం.. న్యాయవ్యవస్థ మీద, రాజ్యాంగం మీద గౌరవం, నమ్మకం ఉంది. నీలాగా లుచ్చా, తుచ్చపు పనులు మేం చేయలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.
బొట్టుపెట్టి.. హారతి పట్టి..!
ఫార్ములా–ఈ రేస్‌కేసులో ఏసీబీ విచారణ పూర్తయ్యాక ఇటు తెలంగాణ భవన్ వద్ద.. అటు ఇంటి వద్ద కేటీఆర్‌కు మంగళహారతులతో స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ తొలుత ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అక్కడ కేటీఆర్ కారు దిగగానే గుమ్మడి కాయతో దిష్టితీసి.. కొందరు నేతలు ఆయన్ను ఎత్తుకుని పార్టీ ఆఫీసులోకి తీసుకెళ్లారు.
అక్కడ మహిళా నేతలు ఆయనకు హారతిచ్చి స్వాగతం పలికారు. అక్కడ ప్రెస్మీట్లో మాట్లాడిన తర్వాత ఆయన నందినగర్‌లోని ఇంటికి వెళ్లారు. అక్కడ కేటీఆర్ భార్య శైలిమ, చెల్లెలు కవిత బొట్టు పెట్టి, హారతి పట్టి లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కేటీఆర్ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక, కేటీఆర్ విచారణ పూర్తయ్యేంత వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణ భవన్లో కూర్చొని పర్యవేక్షించారు.