యాదాద్రి భువనగిరి: అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, తాను చెప్పినా వినకుండా మునుగోడు ప్రజలు కాంగ్రెస్ కే ఓటు వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మోసగాళ్ల మాటలను నమ్మి మోసపోవద్దని... కాంగ్రెస్ కావాల్నా?.. కరెంట్ కావాల్నా? ఆలోచించుకోమని అప్పుడే చెప్పామని కేటీఆర్ అన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి రూ.2లక్షల రుణాలు తెచ్చుకోండి అని, మాఫీ చేస్తానని చెప్పాడని..డిసెంబర్ 9న రుణ మాఫీ ఏమైందని ప్రశ్నించారు. రైతులు, గీత కార్మికులు ఆలోచన చేయాలని కోరారు.
చౌటుప్పల్ మండలం దామేరా గ్రామంలోని బాలాజీ గార్డెన్ లో మునుగోడు నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సన్నాహాక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం పోయేది లేదని.. కానీ ప్రశ్నించే గొంతును మండలికి పంపించాలన్నారు. కాంగ్రెస్.. ఉచిత బస్సు తప్పా.. ఏం చేయలేదని విమర్శించారు.
ఉద్యోగ నోటిఫికేషన్ జారి చేస్తానని నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి పేద కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డ అని.. బిట్స్ బిలానిలో చదివాడని.. అతన్ని గెలిపించాలని కోరారు. ఎన్నికల అఫిడఫిట్ లో 54 క్రిమినల్ కేసులు ఉన్నాయని మల్లన్ననే ఎన్నికల కమిషనర్ కు వివరాలు ఇచ్చాడన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గోల్డ్ మెడలిస్ట్ అయితే.. కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్ అని విమర్శించారు. ఎవరు కావాలో మీరే తేల్చుకోండని కేటీఆర్ అన్నారు.