ఐటీ ఎగుమతులను రూ.10లక్షల కోట్లకు తీసుకెళ్లాం : కేటీఆర్

తెలంగాణలో సమ్మిళిత వృద్ధి ఉందని.. ఢిల్లీ చేతికి పెత్తనం ఇస్తే.. తెలంగాణ అభివృద్ధి ఆగమేనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించడానికి తెలంగాణ ద్రోహులు అందరూ ఏకమవుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సింహం లాంటి వారని.. సింగిల్ గానే వస్తారన్నారు. తెలంగాణ సిఎం ఎవరు అనేది ప్రజలు నిర్ణయిస్తారని...  నరేంద్ర  మోదీ, రాహుల్ గాంధీలు కాదన్నారు.  కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే.. తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలవుతుందని కేటీఆర్ అన్నారు.2023,  నవంబర్ 4వ తేదీ శనివారం హైదరాబాద్ నగరంలోని జలవిహార్ లో న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీ  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఐటీ ఎగుమతులు రూ.10లక్షల కోట్లకు చేరుకున్నాయని.. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు 24వేల కొత్త పరిశ్రమలు వచ్చాయని చెప్పారు.  హైదరాబాద్ లో ఉంటే.. అమెరికాలో ఉన్నట్లు ఉందని రజినీకాంత్ అంటే... హైదరాబాద్ లోనే ఇల్లు కొనుక్కోవాలని అనిపిస్తోందని బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ అన్నారని చెప్పారు కేటీఆర్. 

హైదరాబాద్ అభివృద్ధి అందరికి కనిపిస్తోంది గానీ.. విపక్షాలకు మాత్రం కనిపించడంలేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ గెలవకపోతే.. పెరుగుతున్న హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ స్వయంగా చెప్పారని.. తెలంగాణ కాంగ్రెస్ ను గెలిపిస్తే...మళ్లీ కరెంటు కష్టాలు వస్తాయన్నారు.  

హైదరాబాద్ లో పెట్టాలనుకున్న ఫాక్స్ కాన్ సంస్థను కర్ణాటకలో పెట్టాలని డీకె శివకుమార్ లేఖ రాశారని చెప్పారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని డీకే శివకుమార్ లేఖ రాశారని... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిశ్రమలన్నీ కర్ణాటకకు తరలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.  ఢిల్లీ దొరలకు.. తెలంగాణ ప్రజలకు మధ్య  పోరాటం జరుగుతోందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్తకాదని.. గతంలో నెహ్రూ, ఇందిర గాంధీలతోనూ... అప్పుడు సోనియాతో.. ఇప్పుడు మోదీతో కొట్లాడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ లో సీఎంలు దొరికారు.. కానీ, ఓటర్లు దొరకడం లేదని కేటీఆర్ ఎద్దేవ చేశారు.