కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులా.. కామారెడ్డికి కేసీఆర్ వచ్చారు: కేటీఆర్

కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 24 గంటల ఉచిత కరెంటు ఏడిస్తున్నరని రేవంత్ రెడ్డి అంటున్నారని.. కరెంటు కనపడుతదా.. వచ్చి కరెంటు తీగలను పట్టుకుంటే తెలుస్తది.. కరెంటు వస్తుందా లేదా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో 2023, నవంబర్ 18వ తేదీ శనివారం మంత్రి కేటీఆర్ రోడ్ షో  నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర ఏండ్లలో కొన్ని పనులు చేసుకున్నం.. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొని పనులు చేస్తామని చెప్పారు.కేంద్రంలో మోదీ వచ్చి.. వంట గ్యాసు సిలిండర్ ధర పెంచారని.. మూడోసారి కేసీఆర్ సీఎం అయ్యిన తర్వాత రూ.400లకే సిలిండర్ ఇస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్న పేదలందరికీ రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తామని,  వ్యవసాయం భూమి ఉన్నా.. లేకున్నా.. తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా ఇస్తాని అన్నారు. 

సౌభాగ్యలక్ష్మీ పథకం ద్వారా రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.3వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని.. ఇంతా చేసినా కాంగ్రెస్ నాయకులు ఏం చేశారని అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ధరణి, 24 గంటల కరెంటు వద్దంటున్నారని..పాత పట్వారి వ్యవస్థను తీసుకొస్తామని చెబుతున్నారని.. మళ్లీ దళారుల రాజ్యం మనకు అవసరమా? అని అన్నారు. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తడట.. అట్లా  కేసీఆరే మీ దగ్గరకు వచ్చారని కేటీఆర్ అన్నారు. కామారెడ్డికి కేసీఆర్ వచ్చినంకా మీకు ఏ పనులు ఆగవని.. వేగంగా అభివృద్ధి పనులు జరుగుతాయని కేటీఆర్ చెప్పారు.