లగచర్ల ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో తన పేరును చేర్చడంపై బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ట్విట్టర్‌తోపాటు మీడియాతో వన్ టు వన్ చిట్‌చాట్‌లో విరుచుకుపడ్డారు కేటీఆర్త. తనను ఏదో కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారని తనకు ఎప్పుడో తెలుసని కేటీఆర్ అన్నారు. ‘‘ప్రతి నిత్యం భయంతో బతికే నీకు ఇవన్నీ కుట్రలాగానే కనిపిస్తాయి. ప్రతిక్షణం నువ్వు భయాన్ని శాసిస్తూ ఆ భయంలోనే బతుకుతున్నవ్. పేద రైతన్నల పక్షాన నిలబడినందుకు నన్ను అరెస్ట్ చేస్తానంటే చేస్కో అంటూ సవాల్ విసిరారు.
రైతుల తరఫున నిలబడి తలెత్తుకుని గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తానని... నీ కుట్రలకు భయపడేవాళ్లెవరూ లేరని అన్నారు కేటీఆర్. నిజానికి ఉన్న దమ్మేందో తొందర్లోనే చూద్దువు’’ అని రేవంత్‌నుద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి తనపై ఎంతో ప్రేమ ఉన్నట్టుందని, అందుకే తనను టార్గెట్ చేసుకున్నారని అన్నారు. ‘‘నేను డ్రగ్స్ తీసుకోలేదు. ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు. అవినీతి అంతకన్నా చేయలేదు.
ప్రధాని మోదీనే నేను మోదీయా.. బోడీయా అని అన్నాను. ఏం చేస్కుంటారో చేస్కో అన్నాను. రేవంత్‌కు కూడా అదే చెబుతున్నా. ఏం చేస్కుంటవో చేస్కో. ఎంత ధైర్యం ఉంటే నేను ఈ మాట అంటాను. నిజాయతీకి ఉన్న ధైర్యం అది. కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అంటున్నవ్. ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో. నీ పదవికి ఎసరు పెట్టేందుకు నల్గొండ, ఖమ్మం బాంబులు వేచి చూస్తున్నాయి. సొంత నియోజకవర్గంపైన పట్టు లేని నువ్వు ఏం సీఎంవి అంటూ ధ్వజమెత్తారు కేటీఆర్.
అధికారం పోయిందని నాకు ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేదు. అధికారం వస్తుందని కలలో కూడా నేను ఊహించలేదు. పదేండ్లు ప్రజలు మాకు అవకాశం ఇవ్వడాన్ని అదృష్టంగా భావించాను. రేవంత్ సర్కారు ఐదేండ్లు ఉండాలని కోరుకుంటున్నా. వాళ్లు పూర్తికాలం అధికారంలో ఉంటేనే బీఆర్ఎస్ తర్వాత 15 ఏండ్లు అధికారంలో ఉంటుంది. ఎన్నికల సంస్కరణలు చేస్తే ఒక వ్యక్తి 2 సార్లు సీఎం లేదా పీఎంగా ఉండకూడదు. అలాంటి సంస్కరణలు తేవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కేటీఆర్ అన్నారు.