సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఏ తప్పు చేసినా పదవి పోవుడు ఖాయం

రాజన్న సిరిసిల్ల, వెలుగు: కొత్తగా తెస్తున్న మున్సిపల్‌‌, పంచాయతీరాజ్ చట్టం చాలా పవర్‌‌ఫుల్‌‌గా ఉంటుందని, సర్పంచ్‌‌లు, ఎంపీటీసీలు ఏం చిన్న తప్పు చేసినా పదవి పోవుడు ఖాయమని మున్సిపల్‌‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పైసా లంచం ఇవ్వకుండా సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి రావాలన్నారు. గురువారం సిరిసిల్లలో పల్లె ప్రగతి, వేములవాడలో పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్‌‌ పాల్గొన్నారు. కొత్త మున్సిపల్‌‌, పంచాయతీరాజ్ చట్టం జవాబుదారీతనాన్ని పెంచుతుందన్నారు. మున్సిపల్‌‌ కౌన్సిలర్లకున్న చెడ్డపేరు పోవాలని సూచించారు. పైసా లంచం లేకుండా పనులు పూర్తయ్యే ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోందని, రూల్స్‌‌ ప్రకారం డబ్బులు చెల్లించి ఇంటి నిర్మాణ పర్మిషన్లు పొందొచ్చన్నారు. ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తి కేసీఆర్‌‌ అని, వారి కోరిక మేరకే కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి పాలనను ఈజీ చేశారన్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి వస్తే పదవులు పోతాయని దుష్ప్రచారం చేశారని, కానీ సీఎం కేసీఆర్ రాజన్న ఆలయానికి వచ్చి రెండో సారి అధికారం దక్కించుకోవడంతో ఆ అపోహ తొలగిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌‌మానేరును నింపి మెట్టప్రాంతమైన సిరిసిల్లను పచ్చగా చేశామన్నారు. ఎన్నికలప్పుడే పాలిటిక్స్‌‌ చేయాలని, ఆ తర్వాత అభివృద్ధి గురించే మాట్లాడుకోవాలన్నారు. ప్రతి విలేజ్‌‌లో 2, 3 నెలల్లో శ్మశాన వాటికలు కట్టాలని, డంపు యార్డులు నిర్మించాలన్నారు. ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రోగ్రెస్​రిపోర్ట్ తయారు చేస్తామని కేటీఆర్ చెప్పారు.

హాస్టల్‌‌ను సందర్శించిన కేటీఆర్​

సిరిసిల్లలోని సంక్షేమ హాస్టల్‌‌లో మెస్‌‌ ఇన్‌‌చార్జి దేవయ్య పలువురు స్టూడెంట్స్‌‌ను లైంగికంగా వేధించిన ఘటనపై కేటీఆర్‌‌ సీరియస్‌‌ అయ్యారు. గురువారం హాస్టల్‌‌ను సందర్శించి స్టూడెంట్స్‌‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినులకు ఆత్మరక్షణ కోసం కరాటేలో శిక్షణ ఇప్పిస్తామన్నారు.