
- కమిషన్ సిఫారసుల అమలుకు బడ్జెట్లో ఫండ్స్ కేటాయించాలి: కేటీఆర్
- బీఆర్ఎస్ హయాంలోనే అసెంబ్లీలో తీర్మానం చేశామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపైన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏకసభ్య కమిషన్ ఇచ్చిన సిఫారసులు అమలు చేయడంతో పాటు రాబోయే బడ్జెట్ లో డబ్బులు కేటాయించాలన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశలో కమిషన్ నివేదికపై మంగళవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదేండ్లలో దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు ప్రయత్నం చేసిందన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తిగా దేశంలో దళిత పారిశ్రామికవేత్తలు, గిరిజన పారిశ్రామికవేత్తలు ఎదగాలని.. ఫీక్కి, సీఐఐ తరహాలో డిక్కీ అనే సంస్థ వచ్చిందని, పారిశ్రామికవేత్త వినోద్ కామ్లి చెప్పిన ఫైట్ ద కాస్ట్ విత్ కాపిటల్ అన్న స్ఫూర్తితో ఆర్థికంగా దళిత పరిశ్రామిక వేత్తలను తయారు చేసేందుకు ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. కేవలం విద్య, ఉపాధిలో కాదు.. ఆర్థికంగా ముందుకు పోవడానికి అవకాశాలు కల్పిస్తేనే న్యాయం జరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. జస్టిస్ షమీం అక్తర్ నివేదికలో రెండు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయన్నారు.
సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అవకాశాలు ఉండాలని చెప్పిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టర్లలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12శాతం ఇంప్లిమెంట్ చేయాలన్నారు. చాలా కాంట్రాక్టులు పిలుస్తున్నారు కానీ.. రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. చేవెళ్ల దళిత, గిరిజన డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అంబేద్కర్ అభయహస్తం కింద దళితులకు రూ.12 లక్షలు అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్డిమాండ్ చేశారు.
2014లోనే అసెంబ్లీలో తీర్మానం చేశాం..
ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకున్నట్టు చిత్రీకరించే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేశారని కేటీఆర్ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోసం గాంధీభవన్ వద్ద అమరులైన ఉద్యమకారులకు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గుర్తించి ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 2014, నవంబర్29 న ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మాన్నాన్ని ప్రవేశపెట్టడంతో పాటు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి చట్టం చేయాలని తీర్మానం చేశారని గుర్తు చేశారు.
తీర్మాన కాపీని నేరుగా ప్రధాని మోదీకి స్వయంగా అందించామని తెలిపారు. వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో దేశంలోని ప్రముఖ న్యాయనిపుణులను పెట్టి కేసు వాదించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ .. రాష్ట్ర ప్రభుత్వం బీసీల విషయంలో దగా చేసి.. 51శాతం నుంచి 5శాతం తగ్గించి మోసం చేసిందని నిరసిస్తూ వాకౌట్ చేశామని కేటీఆర్ పేర్కొన్నారు.