- 18 నెలల్లో పనులు పూర్తిచేస్తం: గంగుల
- కేటీఆర్ ఇయ్యాల పనులు ప్రారంభిస్తరు
- కరీంనగర్ లో మొత్తం రూ.615 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తరని వెల్లడి
కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ లో నిర్మించనున్న మానేరు రివర్ ఫ్రంట్ రాష్ట్రానికే హైలైట్ గా నిలుస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ పనులను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభిస్తారని చెప్పారు. సిటీలో మొత్తం రూ.615 కోట్ల పనులకు శంకుస్థాపనలు, భూమి పూజలు చేస్తారని తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో గంగుల మీడియాతో మాట్లాడారు. రూ.410 కోట్లతో రివర్ ఫ్రంట్ పనులు చేపడుతున్నామని, ఇందులో రూ.100 కోట్లతో ఫౌంటెయిన్ లు నిర్మిస్తామని ఆయన చెప్పారు. 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. 9 ఎకరాల్లో రూ.18 కోట్లతో డంపింగ్ యార్డు, రూ.133 కోట్లతో డ్రైనేజీ పనులు, రూ.90 కోట్లతో రోడ్లు, మార్కెట్లు, రూ.23 కోట్లతో సీసీ రోడ్లు, డిజిటల్ లైబ్రరీ పనులను కేటీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. సిటీలో ట్రాఫిక్ ఐలాండ్స్, కొత్తగా 4 జుంక్షన్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ కు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు.
మెడికల్ కాలేజీ కోసం 30 ఎకరాలు...
కరీంనగర్ లో వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి సిటీ నడిబొడ్డున పద్మానగర్ లో సీఎం కేసీఆర్ 10 ఎకరాలు కేటాయించారని గంగుల చెప్పారు. రెండు నెలల్లోపు ఆలయ పనులు ప్రారంభించి, 18 నెలల్లోగా పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాకు కేసీఆర్ మెడికల్ కాలేజీ మంజూరు చేశారని, దాని కోసం శాతవాహన యూనివర్సిటీ దగ్గర 30 ఎకరాల స్థలాన్ని పరిశీలించామని చెప్పారు. అలాగే కొత్తపల్లిలో సీడ్ కంపెనీకి సంబంధించి 46 ఎకరాల స్థలాన్ని పరిశీలించామన్నారు. త్వరలోనే స్థలాలను ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు ఉంటాయన్నారు. కాగా, చొప్పదండిలో రూ.60 కోట్లతో చేపట్టనున్న పనులను కేటీఆర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్యే రవి శంకర్ చెప్పారు.