- నాలుగైదు శాతం మందికే సర్కారు కొలువులొస్తయ్
- రాష్ట్ర జనాభాలో ఉద్యోగులు 2.5 శాతమే
- మనోళ్లు ఒళ్లు వంచి కష్టపడరని బిల్డర్స్ అంటున్నరు: మంత్రి కేటీఆర్
- రేట్లు పెరగడం అభివృద్ధిలో ఒక భాగం
- హైదరాబాద్‌లో రోడ్లపై గుంతలు చాలా తగ్గినయ్
- వ్యవసాయాన్ని దేశం ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేశామని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు : నాలుగైదు శాతం జనాభాకు మించి ప్రభుత్వ ఉద్యోగాలు రావని, తెలంగాణలోనే కాదు ప్రపంచమంతా ఇట్లనే ఉంటదని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘ప్రపంచంలో ఎక్కడా ప్రభుత్వ రంగంలో డైరెక్ట్‌గా గానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పరోక్షంగా గానీ నాలుగైదు శాతం జనాభాకు మించి ఉద్యోగాలు రావు. ఉదాహరణకు తెలంగాణ జనాభా నాలుగు కోట్లు. ప్రభుత్వ ఉద్యోగులు 8 లక్షల నుంచి 9 లక్షల మంది ఉంటరు. అంటే 2.5 శాతం ఉన్నట్లు. మిగతా 97.5 శాతం జనాభా ఏం చేయాలి..? రైతులు ఇతరత్రా పోగా మిగతా వారందరికీ ప్రైవేట్‌రంగం, పెట్టుబడులను ఆకర్షించడం తప్ప వేరే మార్గం లేదు. ఇది ఒక్క తెలంగాణలోనే కాదు.. కేరళ, చైనా ఎక్కడైనా ఇట్లనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు రిజర్వేషన్లపై గందరగోళం ఉందన్నారు. రాష్ట్రంలో మూతబడిన పరిశ్రమలను తెరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. శుక్రవారం శాసన మండలిలో ఇండస్ట్రిస్‌పై షార్ట్ డిస్కషన్ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు లేవనత్తిన అంశాలపై మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే, ఒక్క ఏడాదిలోనే నాలుగు లక్షల కోట్ల విలువైన ధాన్యం చేతికి వచ్చిందని కేటీఆర్ అన్నారు. రేట్లు పెరగడమనేది అభివృద్ధిలో ఒక భాగమని చెప్పారు. మిషన్ భగీరథ పథకం అమలులో 98 శాతం సక్సెస్ అయ్యామన్నారు.
దేశాన్ని సాకుతున్న రాష్ట్రంలో తెలంగాణ నాలుగో ప్లేస్‌లో ఉందని, తెలంగాణ వచ్చినప్పటి ఉంచి ఇప్పటిదాకా 1,32,800పైనే ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. వేరే రాష్ట్రాల కార్మికులు ఒళ్లు వంచి కష్టపడుతారని, మనోళ్లు అలా చేయరని బిల్డర్స్ అంటున్నారని ఆయన చెప్పారు. ‘‘మన హైదరాబాద్ హౌస్‌బిల్డింగ్ ఇండస్ట్రీ చాలా పెద్దది. తమాషా ఏందంటే.. ఏ కన్స్ట్రక్షన్ సైట్‌కు పోయి చూసినా.. వేరే రాష్ట్రాల వాళ్లే పనిచేస్తుంటరు. మనోళ్లు మాత్రం దుబాయ్‌లా ఉంటరు. అక్కడేమైనా బాగుపడ్తున్నరా అంటే.. పది పదిహేను వేలు సంపాదిస్తుంటరు. ఆ మధ్య నేను, ప్రశాంత్‌రెడ్డి కలిసి బిల్డర్స్‌తో మీటింగ్ పెట్టినం. న్యాక్ ద్వారా ఎంతమందైతే అంత మందిని ఇస్తం పనిలో పెట్టుకోండ్రి అని చెప్పినం. దీనికి వాళ్లు..‘మనోళ్లు రారు. బయటోడు వస్తే ఇమ్మిగ్రెంట్ మెంటాలిటో ఏందో కానీ, ఒళ్లు వంచి కష్టపడుతడు. రెండు షిఫ్టులు పనిచేస్తడు. మనవాళ్లు అట్ల చేయరు’ అని అన్నరు. దీన్ని సరిచేయాలి” అని కేటీఆర్ పేర్కొన్నారు. మనవాళ్లు మన దగ్గర పనిచేయడానికి నామోషీ ఏంది? అని ప్రశ్నించారు. దుబాయ్‌లోనో ఎక్కడో సంపాదించుకునే బదులు ఇక్కడే పనిచేసుకునేలా మనోళ్లను ప్రోత్సహిస్తామని చెప్పారు.
రామగుండం ఫర్టిలైజర్‌ను ప్రారంభిస్తం
త్వరలో రామగుండం ఫర్టిలైజర్స్‌ను పున:ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు. పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుపై కేంద్రానికి ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ యాత్రను ఆయన విజ్ఞతకే వదలేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం మాట సాయం తప్ప మూట సాయం చేయడంలేదని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమలు చేస్తోందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తెలంగాణ సమాజం, వ్యవస్థ శాశ్వతమని ఆయన చెప్పారు. మోడీతో జరిగిన నయభారత్ సమావేశంలో ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సమ్మిళిత వృద్ధి అనే త్రీమంత్రాస్‌ను పాటించాలని సూచించానని తెలిపారు.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి.. మా డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యమే
మణికొండలో డ్రైనేజీలో పడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రజనీకాంత్ మృతి చెందిన ఘటన తమ డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని, దీనికి మంత్రిగా తాను బాధ్యత వహిస్తున్నానని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నపై ఆయన స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రజనీకాంత్ మృతికి బాధ్యతగా ఇప్పటికే రూ. 5 లక్షల పరిహారాన్ని అధికారులు అందించారని తెలిపారు. జీవన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు మరో రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 2 సెంటీమీటర్ల కంటే ఎక్కవు వర్షం కురిస్తే హైదరాబాద్ నగరం తట్టుకునే పరిస్థితిలో లేదన్నారు. అమెరికాలోని ఫైనాన్స్ క్యాపిటల్ న్యూయార్క్‌కే వరదముంపు తప్పలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను కుంభవృష్టిని తట్టుకునేలా మున్ముందు చర్యలు తీసుకుంటామని, రోడ్లపై గుంతలు చాలా తగ్గాయని తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో లేవన్నారు. ఏడేండ్లలో వ్యవసాయరంగాన్ని దేశం ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేశామని తెలిపారు. దిగుబడి పెరిగి కొత్త సమస్య వస్తోందని, దీన్ని అధిగమించడానికి అగ్రోబేస్డ్ ఇండస్ట్రీల కోసం ఉమ్మడి పది జిల్లాల్లో 10 ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గోనె సంచుల తయారీ కోసం రూ.887కోట్లతో కామారెడ్డి, వరంగల్, సిరిసిల్లలో మూడు జూట్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్‌పై పీపీపీ మోడ్‌లో 10 ఇంటర్ ఛేంజ్ పాయింట్ల వద్ద ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ వివరించారు.