- బీఆర్ఎస్ గురుకుల బాటతో సర్కారులో చలనం
- మాజీ మంత్రి కేటీఆర్ట్వీట్
హైదరాబాద్: బీఆర్ఎస్ గురుకుల బాటతో కాంగ్రెస్ సర్కారులో ఎట్టకేలకు చలనం వచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చి సామాన్య విద్యార్థుల్లో భయాందోళనలు, తల్లిదండ్రులలో ఆవేదన కలిగించారని ఫైర్అయ్యారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఎవరెస్టు వంటి శిఖరాలను అధిరోహిస్తే .. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రి బెడ్లను ఎక్కించారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో గురుకుల విద్యాలయాల్లో సీట్ల కోసం పోటీ .. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రిలో బెడ్ల కోసం పోటీ. దొంగలుపడ్డ ఆరు నెలలకు అన్నట్టు ఇప్పుడు గురుకులాల బాటపట్టారు. గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు.. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి. ఫొటోలకు పోజులు ఇవ్వడం కాదు. -పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండి. కెమెరాల ముందు హంగామా చేసుడు కాదు-గురుకుల బిడ్డల గుండెచప్పుడు వినండి. మంది మార్బలంతో దండయాత్ర చేయకండి- గురుకుల సమస్యలను తీర్చే ప్రయత్నం చేయండి. ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు.