యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కేసీఆర్ ఆనవాళ్లు!: మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్

  • తెలంగాణ చరిత్రపై కేసీఆర్ చెరగని సంతకం

హైదరాబాద్: తెలంగాణ చరిత్రపైన కేసీఆర్ చేసిన చెరగని మరో సంతకం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘నల్గగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) కే‌సీఆర్ సుదీర్ఘ దృష్టికి, భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో అనితరసాధ్యమైన వేగానికి మరొక ఉదాహరణ. ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం వెనక ఉన్న కేసీఆర్ దార్శనికత, కృషి తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుంటుంది.

స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఇదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిత్యం కరెంట్ కోతలు, వారానికి రెండు రోజుల పవర్ హాలీడేల దుస్థితి ఉండేది. ఇప్పుడు తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా తీర్చిదిద్దారంటే అది కేసీఆర్ దార్శనికతే’ అని పేర్కొన్నారు.