కంచ గచ్చిబౌలి భూములపై పోరాటం ఇంకా అయిపోలే : కేటీఆర్

 కంచ గచ్చిబౌలి భూములపై పోరాటం ఇంకా అయిపోలే : కేటీఆర్

అందరం కలిసి చేయిచేయి కలిపి పోరాడుదాం: కేటీఆర్
యూనివర్సిటీని.. లేనేలేని ఫోర్త్ సిటీకి తరలించేందుకు కుట్రలు
హెచ్​సీయూ విద్యార్థులు, పర్యావరణవేత్తలకు బహిరంగ లేఖలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూములపై పోరాటం ఇంకా అయిపోలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్​ అన్నారు. అందరం చేయిచేయికలిపి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం ఆయన 
హెచ్​సీయూ విద్యార్థులు, పర్యావరణ వేత్తలకు బహిరంగ లేఖ రాశారు. ఆ భూమి రియల్​ఎస్టేట్ వ్యాపారం కోసం కాదని, పర్యావరణానికి రక్షణ కవచమని అన్నారు. అలాంటి భూముల విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం చాలా బాధిస్తున్నదన్నారు. అభివృద్ధి పేరిట పర్యావరణ హత్య చేస్తున్నదన్నారు.

 ఈ భూములను కాపాడేందుకు ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ హెచ్​సీయూ విద్యార్థులు శాంతియుత పంథాలో పోరాటం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఆ ఉద్యమాన్ని గౌరవించాల్సింది పోయి.. వారిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నదని ఆరోపించారు.

హెచ్​సీయూను కూల్చి వేస్తామని ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతున్నదని కేటీఆర్​ ఆరోపించారు. విద్యార్థులు పోరాటం ఆపకుంటే యూనివర్సిటీని మరోచోటుకు మారుస్తామన్న బెదిరింపులు వస్తున్నాయన్నారు. అసలు లేనేలేని ఫోర్త్ సిటీకి యూనివర్సిటీని షిఫ్ట్ చేస్తామని చెబుతున్నారన్నారు. ప్రభుత్వం నైతికంగా దిగజారిపోయిందన్నారు.