కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేయకుంటే.. 50 వేల రైతులతో వచ్చి ఆన్​ చేస్తం: కేటీఆర్ 

కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేయకుంటే.. 50 వేల రైతులతో వచ్చి ఆన్​ చేస్తం: కేటీఆర్ 
  • ఆగస్టు 2 డెడ్​లైన్
  • చిన్న ఘటనను చూపి బీఆర్​ఎస్​ను దెబ్బకొట్టే ప్రయత్నం
  • కక్షతోటే తెలంగాణను ఎండబెడుతున్నరని కామెంట్​
  • పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ విజిట్
  • కుంగిన 7వ బ్లాక్ వద్దకు మాత్రం వెళ్లని కేటీఆర్, నేతలు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు పంప్​హౌస్​లను రాష్ట్ర సర్కార్ ఆన్​చేయకపోతే తామే వాటిని ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి శుక్రవారం మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ, కన్నెపల్లి(లక్ష్మీ) పంప్ హౌస్ ను కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ప్రభుత్వానికి ఆగస్టు 2వ తేదీ వరకు డెడ్​లైన్ పెడ్తున్నం. ఆ లోగా కాళేశ్వరం మోటర్లు స్టార్ట్ చేయాలే.. లేదంటే 50 వేల మంది రైతులతో వచ్చి మేమే పంపులు స్టార్ట్ చేస్తం’’ అని అన్నారు.

‘‘వంద కాంపోనెంట్లు ఉండే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ ‌‌  ‌‌ ‌‌  లో చిన్న చిన్న రిపేర్లు రావడం కామన్‌‌. మేడిగడ్డ బ్యారేజీకి పెద్దగా ఏం కాలే. మీరే చూస్తున్నారుగా 10 లక్షల క్యుసెక్కుల వరదను తట్టుకొని నిలబడింది. ఇక్కడ జరిగిన చిన్న సంఘటనను చూపెట్టి రాజకీయంగా బీఆర్‌‌ఎస్‌‌ పార్టీని దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నరు. కేసీఆర్ కు పేరొస్తదని కాళేశ్వరం మోటర్లు స్టార్ట్ చేస్తలేరు’’ అని ఆరోపించారు. రామగుండం నుంచి కాళేశ్వరం చేరుకున్న కేటీఆర్ బృందం ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం పుష్కరఘాట్‌‌ ‌‌  ‌‌ ‌‌   వద్దకు వెళ్లి గోదారమ్మకు పూజలు చేశారు. అక్కడి నుంచి కన్నెపల్లి(లక్ష్మి) పంప్‌‌ హౌస్​కు చేరుకొని మోటార్లను, ఫోర్‌‌ ‌‌  ‌‌ ‌‌  బేలో ఉన్న నీటి నిల్వలను పరిశీలించారు. అక్కడే ఇరిగేషన్‌‌ ఇంజనీర్లతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం కుంగిన మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ పరిశీలించారు. బ్యారేజీపై ఉన్న రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లి 5వ బ్లాక్‌‌ వద్ద ఆగారు. అక్కడే 38వ పిల్లర్‌‌ దగ్గరి నుంచి గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. కుంగిన 7వ బ్లాక్‌‌ వద్దకు కేటీఆర్‌‌ సహా బీఆర్ఎస్ నేతలెవరూ‌‌ వెళ్లలేదు. ఆ బ్లాక్​ను దూరం నుంచే పరిశీలించి వెళ్లిపోయారు.అక్కడికి వెళ్తే రిస్క్ అని సహచరులు వారించినందు వల్లే వెళ్లలేదని సమాచారం. 

రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయొచ్చు

కాంగ్రెస్ సర్కారు పనితీరు ఆంధ్ర పాలకుల లాగే ఉందని, రాజకీయ కక్షతో తెలంగాణను ఎండబెడుతున్నారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే ఈ కుట్ర చేస్తున్నాయని కేటీఆర్​ ఆరోపించారు. ఎగువన గోదావరి ఎండిపోయిందని, దిగువన వస్తున్న వరద సముద్రం పాలవుతోందన్నారు. ఎస్సారెస్పీ, మిడ్‌‌మానేరు, లోయర్‌‌ మానేరు డ్యామ్‌‌లు, కొండపోచమ్మ సాగర్‌‌ , మల్లన్న సాగర్‌‌, రంగనాయక సాగర్‌‌, అన్నపూర్ణ, శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్లు నీళ్లు లేక 
వెలవెలబోతున్నాయని పేర్కొన్నారు. 

రాష్ట్రం మొత్తానికి నీళ్లిచ్చే సత్తా ఉంది: జగదీశ్ రెడ్డి

రాష్ట్రం మొత్తానికి నీళ్లు ఇచ్చే కెపాసిటీ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్నదని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా నాయకుల కుట్రలను బయటపెట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి రాష్ట్ర రైతుల నోట్లో మట్టికొడుతున్నాయని ఆరోపించారు.

కాళేశ్వరంలో ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి గోదావరి వరద పోటెత్తుంటే.. కరీంనగర్ నియోజకవర్గంలోని ఎల్ఎండీ లో చుక్క నీళ్లు లేక ఇసుకదిబ్బలు కనబడుతున్నాయని ఎమ్మెల్యే కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల వలన ఎల్ఎండీ, మిడ్ మానేరు ఎండిపోతున్నాయని ఆరోపించారు. పర్యటనలో మల్లారెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌‌ ‌‌  ‌‌ ‌‌   రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌‌, సత్యవతిరాథోడ్‌‌ ‌‌తదితరులు పాల్గొన్నారు.