- మాకు పదేండ్లలో ఏం చేసిండ్రు
- స్వార్థ రాజకీయాల కోసమే వచ్చిండ్రు
- ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసన కారులు
హైదరాబాద్: ‘నిన్నెవరు రమ్మన్నరు.. మేం పిలవనేలేదు.. ఎందుకు వచ్చిండ్రు. మేం ఎవరితోనూ కబురు పెట్టలే.. పిలవకున్నా ఎందుకు వచ్చారు’ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఆటో డ్రైవర్లు నిలదీశారు.
ఇందిరా పార్క్ వద్ద ఆటో యూనియన్లు చేపట్టిన మహాధర్నాకు మద్దతు తెలిపేందుకు వచ్చిన కేటీఆర్కు చుక్కెదురైంది. పదేండ్లు అధికారంలో ఉండి తమకేమీ చేయలేదని అన్నారు. కేవలం వ్యక్తిగత, స్వార్థపూరిత రాజకీయాల కోసం ఆయన ఇవాళ ధర్నాకు వచ్చారని.. తమ కోసం రాలేదని ఆరోపించారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న తమను రాజకీయాలకు వాడుకోవద్దని అన్నారు.
మార్పు కొంపలు ముంచింది
కాంగ్రెస్ఆరు గ్యారెంటీల పేరుతో అనేక హామీలిచ్చి అందరి నోట్లో మట్టి కొట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆటో డ్రైవర్ల ధర్నాలో ఆయన మాట్లాడారు. మార్పు, మార్పు అనుకుంటూ కొంపలు ముంచిందని అన్నారు.
‘నిరుద్యోగులు, రైతులు, వృద్ధులు, మహిళలు అందరినీ కాంగ్రెస్ మోసం చేసింది. దాదాపు ఆరున్నర లక్షల మంది ఆటోడ్రైవర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రాహుల్ గాంధీ చెప్పిన తియ్యని, కమ్మని మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరముంది. సంక్షేమ పథకాలకు మేం వ్యతిరేకం కాదు. మానవత్వంతో స్పందించి హామీలు నెరవేర్చాలి. ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 5వేలు ఇవ్వాలి.
రేవంత్ రెడ్డికి పోలీసుల మీద కూడా నమ్మకం లేక సెక్యూరిటీలో నుంచి బెటాలియన్ పోలీసులను తీసేశారు. నల్గొండలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎదుట కాంగ్రెస్ నాయకుడే మనం బయటకు వెళ్తే తన్నే పరిస్థితి ఉందని చెప్పాడు. కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి పోరాటం చేయాల్సిన అవసరముంది. ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా సరే ప్రజల కోసం పోరాడతం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.