ఈనెల 6న హుజుర్ నగర్ కు కేటీఆర్
హుజూర్‌నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఈ నెల 6న కేటీఆర్ రానున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. ఆదివారం స్థానిక క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ పర్యటనను సక్సెస్ చేసేందుకు నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతరం సభా స్థలాన్ని పరిశీలించారు. సమావేశంలో నాయకులు గెల్లి రవి, అట్లూరి హరిబాబు, కేఎల్‌ఎన్.రెడ్డి, దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, నర్సింగ్ వెంకటేశ్వర్లు, చిట్యాల అమర్నాథ్‌రెడ్డి, బెల్లంకొండ అమర్, జక్కుల శంభయ్య, యడ్ల విజయ్, కడియాల రామకృష్ణ, పి.సంపత్ పాల్గొన్నారు. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా పట్టణంలోని విఘ్వేశ్వర, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యువత స్వయం ఉపాధి పొందాలి
హుజూర్‌నగర్ – కోదాడ రోడ్డులో ఏర్పాటు చేసిన కారు గ్యారేజీని ఆదివారం ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. యువత ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ టైంను వృథా చేసుకోకుండా స్వయం ఉపాధి సాధించాలని సూచించారు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను వినియోగించుకోవాలని చెప్పారు.
న్యూ ఇయర్ సందడి
వెలుగు నెట్‌వర్క్ : ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం నూతన సంవత్సర సందడి కనిపించింది. జనవరి 1ని పురస్కరించుకొని ప్రజలు, నాయకులు, ఆఫీసర్లు కేక్ కట్ చేసి ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. మరోవైపు ఆలయాలు, చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయంతో పాటు, నల్గొండలోని రామాలయం, పానగల్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో దర్శన, ప్రసాద క్యూలైన్లు, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, సత్యనారాయణస్వామి వ్రత మండపం, బస్ బే, ప్రధానాలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆలయ ఆఫీసర్లు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో కొండపైకి చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. కొందరు భక్తులు ఘాట్‌రోడ్డు, మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ కొండపైకి చేరుకున్నారు. యాదగిరిగుట్టలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
యాదగిరిగుట్టపై వసతులు కల్పిస్తాం : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టలో వసతులు లేని కారణంగా భక్తులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, ఆ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ఆదివారం యాదగిరిగుట్టకు వచ్చిన ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభు నారసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్దాల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఏఈవో రామ్మోహన్ స్వామి వారి ప్రసాదం అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితోనే యాదగిరిగుట్ట అద్భుతంగా నిర్మాణమైందన్నారు. కొండపై భక్తుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కేసీఆర్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అనంతరం భక్తులతో మాట్లాడి ప్రధానాలయ పునర్నిర్మాణం, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంటేకార్ పవన్‌కుమార్, స్థానిక పార్టీ నాయకులు ఉన్నారు.
టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు చేపట్టాలి
సూర్యాపేట, వెలుగు : టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్ల ను వెంటనే చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేటలో నిర్వహించిన ఆ సంఘం జిల్లా కార్యనిర్వాహకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖలో దీర్ఘకాలంగా ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దీంతో స్టూడెంట్లు క్వాలిటీ ఎడ్యుకేషన్‌కు దూరం అవుతున్నారన్నారు. టీచర్ల ట్రాన్స్‌ఫర్లు చేపట్టకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గబాధ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి హరిప్రసాద్, జిల్లా అధ్యక్షుడు పర్వతం సంధ్యారాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి యామ రమేశ్, ట్రెజరర్ అమరవాది బ్రహ్మచారి, శ్రీనివాసరావు, తిరుమలేశ్ పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సును సక్సెస్ చేయాలి
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండలోని పీఆర్‌టీయూ బిల్డింగ్‌లో ఈ నెల 7న నిర్వహించనున్న ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సును సక్సెస్ చేయాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, ఇప్పడు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నా కేంద్రం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చకపోతే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్‌చార్జి రామాంజి సైదులు అధ్యక్షతన జరిగిన మీటింగ్‌లో జాతీయ ఉపాధ్యక్షుడు కత్తుల తులసీదాస్, నకిరేకంటి అంజయ్య, ఎంఎస్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్, రాష్ట్ర కార్యదర్శి కాశయ్య, శ్రీనివాస్, రంజిత్, చంద్రయ్య, పెద్ది సైదులు తదితరులు పాల్గొన్నారు.
రామ్మోహన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు కృషి
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటలో డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటుకు కృషి చేసిన వెదిరె రామ్మోహన్ రెడ్డి నేటి తరానికి ఆదర్శప్రాయుడని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డ అరవింద ధ్యానకేంద్రంలో ఆదివారం జరిగిన మీటింగ్‌లో మంత్రి మాట్లాడారు. పట్టణంలో రెడ్డి హాస్టల్ నిర్మించి పేద విద్యార్థులకు వసతి కల్పించాలని గుర్తు చేశారు. జమ్మిగడ్డలో రామ్మోహన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వెదిరె రామ్మోహన్‌రెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, అడిషినల్ కలెక్టర్ మోహన్‌రావు, జడ్పీ వైస్‌చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, సుధాకర్ పీవీసీ కంపెనీ చైర్మన్ మీలా మహదేవ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ఉప్పల ఆనంద్ పాల్గొన్నారు.