హైదరాబాద్, వెలుగు: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ రిజల్ట్స్ గట్టి షాకే ఇచ్చాయి. జీహెచ్‌ఎంసీ ఎలక్షన్లలో పార్టీ క్యాండిడేట్ల ప్రకటన నుంచి ప్రచారం దాకా గెలుపు బాధ్యతను కేటీఆర్ భుజాన వేసుకున్నారు. ఆయన స్వయంగా రోడ్‌షోలు నిర్వహించిన ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రచారం చేసినా సగం సీట్లలో మాత్రమే పార్టీ క్యాండిడేట్లు గెలిచారు. ముఖ్యంగా ఎల్‌బీ నగర్, ముషీరాబాద్, గోషామహల్, మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో టీఆర్ఎస్కు ఘోర పరాజయం ఎదురైంది. కేటీఆర్ నవంబర్ 21 నుంచి ప్రచారం ముగిసే 29వ తేదీ వరకు సిటీలోని 13 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అదే సమయంలో కార్పొరేట్లు, రియల్టర్లు, వ్యాపార వాణిజ్య వర్గాలు, కుల సంఘాలతో మీటింగ్‌లు నిర్వహించి టీఆర్ఎస్కే ఓటేయాలని విజ్ఞప్తులు చేశారు. అయినా ఫలితాలు అనుకూలంగా రాకపోవడం గమనార్హం.
సగం చోట్ల దెబ్బ
కేటీఆర్ కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, గోషామహల్, సనత్‌నగర్, సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని డివిజన్లలో టీఆర్ఎస్ క్యాండిడేట్ల కోసం ప్రచారం చేశారు. ఎల్‌బీ నగర్ సెగ్మెంట్లోని నాగోల్, మన్సూరాబాద్, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హస్తినాపురం, చంపాపేట్, లింగోజిగూడ, చైతన్యపురి, గడ్డిఅన్నారంలో టీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయింది. ముషీరాబాద్ సెగ్మెంట్లోని ఆరు డివిజన్లకుగాను ఐదుచోట్ల బీజేపీ విజయం సాధించగా.. భోలక్‌పూర్‌లో ఎంఐఎం గెలుపొందింది. గోషామహల్‌లోనూ ఆరు డివిజన్లకు ఐదింట్లో బీజేపీ, ఒక్క చోట ఎంఐఎం గెలిచాయి. మహేశ్వరం నియోజకవర్గంలోని 2 డివిజన్లలోనూ ఓటమి తప్పలేదు. అంబర్‌పేట, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో బీజేపీ మూడేసి డివిజన్‌లలో గెలుపొందింది. ఖైరతాబాద్‌లో రెండు డివిజన్‌లను కోల్పోయింది. ఉప్పల్‌లో రెండు చోట్ల కాంగ్రెస్, మరో రెండు చోట్ల బీజేపీ క్యాండిడేట్లు గెలిచారు. మిగతా ఆరు డివిజన్లలో టీఆర్‌ఎస్ క్యాండిడేట్లు విజయం సాధించారు. కేటీఆర్ ప్రచారం చేసిన వాటిల్లో.. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లోనే టీఆర్ఎస్కు కాస్త బెటర్‌గా రిజల్ట్స్ వచ్చాయి.