స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ
హైదరాబాద్, వెలుగు: ఫార్మాసిటీ ప్రాజెక్ట్‌ను కొనసాగిస్తున్నారా..? లేదా..? అనే దానిపై స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం రేవంత్‌కు కేటీఆర్ ఓ బహిరంగ లేఖ రాశారు. ఒకవేళ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లైతే, ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించాలని సూచించారు.
ఫార్మాసిటీకి బదులు వేరే అవసరాలకు ఆ భూములను వాడుకుంటే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేటీఆర్ హెచ్చరించారు. ప్రాజెక్టును కొనసాగించే ఉద్దేశం ఉంటే, గతంలో ఉన్న ప్లాన్ ప్రకారం కనసాగించాలని, ఇంకా విస్తరించాలని ఆయన తెలిపారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే అంతర్జాతీయంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ టాప్ లో ఉంటుందని చెప్పారు. అదే విధంగా 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అందించవచ్చన్న భావనతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ప్రాజెక్టు గందరగోళంలో పడిందన్నారు.