హైదరాబాద్, వెలుగు: చేనేత కార్మికులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఏడాది బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించి జీవోను ఫిబ్రవరి మాసంలోనే విడుదల చేశామని తెలిపారు. మార్చి నెల మొదలైనా కాంగ్రెస్ సర్కారు నుంచి కదలిక లేకపోవడంతో వీటిపై ఆధారపడిన వారిలో ఆందోళన పెరిగిపోతోందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇది 35 వేల మంది కార్మికులు, వారి కుటుంబాలకు సంబంధించిన ముఖ్యమైన సమస్య కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు అందించి ఆదుకోవాలన్నారు.
టెస్లా కంపెనీని హైదరాబాద్‌కు తీసుకురండి
ఎలక్ట్రిక్ వాహనాలకు చెందిన దిగ్గజ కంపెనీ టెస్లాను తెలంగాణకు తీసుకొచ్చేలా కృషి చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టెస్లా ప్రతినిధులను మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ కారు తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇండియాలో 2 బిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు టెస్లా ప్లాన్ చేస్తున్నది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు అమెరికా నుంచి టెస్లా బృందం త్వరలో ఇండియాకు రానుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ స్పందించారు.