ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ప్రాధాన్యత ఉన్న హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు మంత్రి కేటీఆర్. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని కేంద్రమంత్రులు హర్షవర్దన్, సదానంద గౌడకు లేఖ రాశారు. దేశీయంగా తయారు చేసిన తొలి వాక్సిన్ కోవాగ్జిన్ ఇక్కడి నుంచే తయారు అవుతోందని.. స్పుత్నిక్ వి, బయోలాజికల్- ఇ కార్బివాక్స్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కంపెనీల వ్యాక్సిన్లు సైతం ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు. కేంద్రం ఈ ఏడాది చివరి వరకు దాదాపు 50 శాతం వాక్సినేషన్ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారని.. ఇందుకు అవసరమైన వాక్సిన్ ఉత్పత్తి పెద్ద ఎత్తున హైదరాబాద్ లోనే జరగబోతుందన్నారు కేటీఆర్. 100 కోట్ల డోసులు హైదరాబాద్ నగరం నుంచి రానున్న ఆరు నెలల్లో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన హైదరాబాద్ నగరంలో వాక్సినేషన్ టెస్టింగ్ సెంటర్ లేకపోవడంతో అనేక సమస్యలొస్తున్నాయని తెలిపారు.
దేశంలో ఉన్న ఏకైక వాక్సిన్ టెస్టింగ్ సెంటర్.. కసౌలిలో ఉందని, ఈ సెంటర్ కి హైదరాబాద్ సంస్థలు తయారుచేసే ప్రతీ బ్యాచ్ వ్యాక్సిన్ ని టెస్టింగ్ కు పంపాల్సిన అవసరం ఉంటుందన్నారు కేటీఆర్. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానాల్లో పంపి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పంపాలని, మొత్తం ఈ ప్రక్రియకి 30 నుంచి 45 రోజుల టైం పడుతుందన్నారు. దీంతో విలువైన సమయం వృధా అవుతుందని చెప్పారు మంత్రి. దేశంలో రెండవ వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయడంతో మరింత వేగంగా హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుందని కేంద్రాన్ని కోరారు. దేశంలోనే అత్యధిక వ్యాక్సిన్ తయారీ కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నందున వాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ను ఇక్కడ ఏర్పాటు చేస్తే ప్రతీ నెల 8 నుంచి 10 కోట్ల అదనపు వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేసే వీలు కలుగుతుందని తెలిపారు. వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు కేటీఆర్. హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ కి అవసరమైన భూమిని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.