చేనేత కార్మికుల సమస్యలపై ప్రధానికి కేటీఆర్ పోస్ట్ కార్డ్

చేనేత కార్మికుల  సమస్యలపై మంత్రి కేటీఆర్ కలం కదిపారు. కార్మికుల సమస్యలను  వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వయంగా పోస్ట్ కార్డుపై లేఖ రాశారు. తనలాగే చేనేత కార్మికులు, టీఆర్ఎస్ శ్రేణులు ప్రధాని మోడీకి లక్షలాదిగా  పోస్ట్ కార్డులు రాయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈమేరకు ఇవాళ ఆయనొక ట్వీట్ చేశారు. చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే వివిధ వేదికల ద్వారా చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానన్న కేటీఆర్.. వాటిపై మోడీ సర్కారు నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు. గతంలోనూ సీఎం కేసీఆర్ తో పాటు తాను పలుమార్లు చేనేత కార్మికుల సమస్యలను వివరిస్తూ ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. కాగా, బై పోల్ జరుగుతున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో చేనేత కార్మికులు అత్యధిక  సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని లక్ష్యంగా చేసుకొని రాజకీయ పార్టీలు ప్రచారాస్త్రాలను సంధిస్తున్నాయి.