హైదరాబాద్: లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ ఒక బోగస్ అని కోర్టు చెప్పిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోలీసులు కిరాతంగా వ్యవహరిస్తు్న్నారని.. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేట్ సైన్యం లాగ పరిస్థితి తయారైందని మండిపడ్డారు. రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలను ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు చేస్తు్న్నారని పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024, నవంబర్ 14వ తేదీన మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు.
ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. లగచర్ల గ్రామస్థులకు న్యాయం జరిగే వరకు నేను ఊరుకోనని.. లగచర్ల బాధితులను ఢిల్లీ తీసుకుపోయి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తామన్నారు. నేను ఏం తప్పు చేయలేదని.. అందుకే నేను ఎవరికీ భయపడనని తేల్చిచెప్పారు. మళ్లీ సవాల్ చేస్తున్న.. ఈ రేస్ అయిన ఇంకేదైనా కేసులోనైనా అరెస్ట్ చేస్తే చేసుకోండన్నారు. అక్రమ కేసులను ఎదుర్కొనే ధైర్యం నాకు ఉందని.. ఇలాంటి వాళ్ళను చాలా మందిని చూశామన్నారు.
రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్‌లో ఇంకా ఎన్ని రోజులు ఉంటావో తెలియదు.. ముందు నీ సీఎం కుర్చీ కాపాడుకో అని ఎద్దేవా చేశారు. ఉత్తమ్, భట్టి నీ కుర్చిలో కూర్చుంటారని.. బాంబులు పేల్చేది నీ మీదనే.. మీ పార్టీ లోనేనని కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ కోసం రేవంత్ రెడ్డి కొత్తగా చేసేదేమి లేదని.. కేవలం డబ్బు దండుకోవడం కోసమే మూసీ టాపిక్ ఎత్తుకున్నారని ఆరోపించారు. డీపీఆర్ లేకుండానే రూ. లక్ష 50 వేల కోట్ల అయితవని ఎలా చెప్పారని నిలదీశారు. మూసీ పేరుతో ఢిల్లీకి డబ్బులు పంపేందుకు ప్లాన్ చేశారని విమర్శలు గుప్పించారు.