రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్

రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్

హైదరాబాద్: రైతు రుణమాఫీపై అసెంబ్లీలో హాట్ హాట్ చర్చ సాగింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తుటాలు పేలాయి. రుణమాఫీ మీరు సరిగ్గా చేయలేదు అంటే.. లేదు మీరే అసంపూర్తిగా చేశారని ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం (మార్చి 27) ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ మిత్తీలకే సరిపోయిందని ఎద్దేవా చేశారు. 

బీఆర్ఎస్ ఫస్ట్ టర్మ్‎లో ఏకమొత్తంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్నారు.. కానీ ఎన్నికలయ్యాక ఐదేళ్లకు రుణమాఫీ చేశారు. రెండోసారి రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు చేయలేదు.. తీరా ఎన్నికల ముందు చేశారు. బీఆర్ఎస్ పదేళ్లలో 21 లక్షల మంది రైతులకు రూ.16,908 కోట్లు రుణమాఫీ చేసింది. కానీ, మేం 25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్లు.. రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 

Also Read :- తెలంగాణ అప్పులపై లెక్కలతో సహా బీఆర్ఎస్‎ను చెడుగుడు ఆడిన CM రేవంత్

‘‘కొండారెడ్డి పల్లి పోదామా..? కొడంగల్ పోదామా..? రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ అయ్యిందని నిరుపిస్తారా..? ఒకవేళ రుణమాఫీ 100 శాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా’’ అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ అసెంబ్లీలో సవాల్ విసిరారు. రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు ఇస్తామని చెప్పలేదా..? మహిళలకు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 వంద బోనస్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు.. కానీ ఎన్నికల తర్వాత మాట మార్చి కేవలం సన్న వడ్లకే ఇస్తామని కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని విమర్శించారు.