సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (నవంబర్ 26) కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తను తీసుకొచ్చి సిరిసిల్ల కలెక్టర్‌గా కూర్చొబెట్టారు. బీఆర్ఎస్ నేతలకు పార్టీ మారాలని కలెక్టర్ చెబుతున్నాడు.
అటువంటి సన్నాసిని కలెక్టర్‌గా తీసుకొచ్చి క్షక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాసి పెట్టుకోండి.. నేను అంత మంచివాడిని కాదని అందరికి తెలుసు.. అతి చేస్తోన్న కలెక్టర్లు, అధికారులు, బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి కాదు.. వాళ్ల జేజేమ్మ వచ్చిన బీఆర్ఎస్ను ఏం చేయలేదని అన్నారు. కలెక్టర్లు, పోలీసులతో ఎన్ని రోజులు డ్రామాలు చేస్తారో చూద్దామన్నారు.
అక్రమంగా నన్ను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు.. కానీ కేసులకు, అరెస్ట్‌లకు భయపడే ప్రసక్తే లేదని లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీనే కారణమని.. కానీ కేసీఆర్ త్యాగాన్ని కొందరు తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర చేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి తప్పు జరిగిందని ఇప్పుడు ప్రజలంతా బాధపడుతున్నారని అన్నారు. ఆరు గ్యారెంటీలు అని చెప్పి అర గ్యారెంటీ అమలు చేశారని ఎద్దేవా చేశారు. దేవుళ్లపై ఒట్లు వేసి పథకాలకు తూట్లు పొడుస్తున్నారని.. కాంగ్రెస్ అక్రమాలు, అవినీతి బయటపెడతామన్నారు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని.. తన సొంత నియోజకవర్గం కొడంగల్ వెళ్తే సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఉరికించి కొడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.