కేయూ కబ్జాలపై .. మున్సిపల్ నిర్లక్ష్యం!

కేయూ కబ్జాలపై .. మున్సిపల్ నిర్లక్ష్యం!
  • సర్వే నెంబర్ 229లో ఆక్రమణలున్నట్లు సర్వేలో వెల్లడి..
  • 214, 60 లో కూడా కబ్జాలు గుర్తింపు
  • నలుగురు ఉద్యోగులకు మెమోలు జారీ చేసిన వర్సిటీ రిజిస్ట్రార్
  • ఆక్రమణలపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా జీడబ్ల్యూఎంసీకి లెటర్ 
  • పది రోజులవుతున్నా పట్టించుకోని ఆఫీసర్లు

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ భూముల ఆక్రమణలపై చర్యలకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు ఆక్రమణల తొలగింపులో హైడ్రా కబ్జాకోరులను హడలెత్తిస్తుంటే కేయూ భూముల కబ్జాల విషయంలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఇటీవల కేయూ భూముల ఫిజికల్ సర్వే ప్రారంభించారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కేయూ అధికారులు మున్సిపల్ అధికారులకు లేఖ రాసి వారం దాటినా ఇంతవరకు స్పందించలేదు. దీంతో వర్సిటీ కబ్జాల తొలగింపునకు మున్సిపల్ ఆఫీసర్ల నిర్లక్ష్యమే అడ్డంకిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

229 లో 13 ఆక్రమణలు..

గతంలో వరంగల్ జిల్లాలో పని చేసిన అనుభవం, కేయూపై పూర్తి అవగాహన ఉండటంతో వర్సిటీ ఆక్రమణల వ్యవహారంపై ఇన్​చార్జి వీసీ వాకాటి కరుణ స్పెషల్ ఫోకస్ పెట్టారు. దాంతోపాటు అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్), విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్ మెంట్ అధికారులు జాయింట్ ఇన్ స్పెక్షన్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ నెల 11న కుమార్ పల్లి శివారు 229 సర్వే నెంబర్, 214, 60 సర్వే నెంబర్​ లోని భూమికి హద్దులు నిర్ణయించారు.

229 లో ఉండాల్సిన 6 ఎకరాల 15 గుంటల భూమిలో దాదాపు ఎకరానికి పైగా కబ్జాకు గురై, 13 ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. అందులో ప్రధానంగా ఆర్ట్స్ కాలేజీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్ బాబు, ఎల్లస్వామి, బుచ్చయ్య, యాదగిరి అనే మరో ముగ్గురు యూనివర్సిటీ సిబ్బంది కూడా ఆక్రమణలోనే ఉన్నట్లు నిర్ధారించారు. కేయూలో పని చేస్తూ వర్సిటీ భూములనే మింగేయడంతో వారికి రిజిస్ట్రార్ మల్లారెడ్డి మూడు రోజుల కిందట మెమోలు జారీ చేశారు.

మున్సిపల్ ఆఫీసర్లకు ఫిర్యాదు..

ఈ నెల 11న 229లో సర్వే జరగగా, 20న రెవెన్యూ అధికారులు యూనివర్సిటీ ఆఫీసర్లకు సర్వే రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులో 13 ఆక్రమణలున్నట్లు గుర్తించగా, మున్సిపల్ యాక్ట్​-2019 ప్రకారం తగిన చర్యలు చేపట్టి, కబ్జాలు తొలగించాల్సిందిగా ఆ మరునాడే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు లేఖ అందించారు. కానీ, లేఖ అందించి, పది రోజులవుతున్నా ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, 2022లో డీజీపీఎస్ సర్వే ఆధారంగా కూడా 229 సర్వే నెంబర్​ లోని 13 మందికి నోటీసులు ఇచ్చారు. కానీ, ఆ తర్వాత వ్యవహారం తెరమరుగైంది. దీంతో ఇప్పుడు కూడా అదే రిపీట్ చేస్తారేమోననే సందేహాలు వినిపిస్తున్నాయి.

ఇన్​ఛార్జ్​ వీసీ దృష్టికి సమస్యలు..

కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ అశోక్ బాబు విజిలెన్స్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు చేసిన సర్వేపై తప్పుడు ప్రచారం చేయడంతోపాటు హద్దులు నిర్ణయించేందుకు వెళ్లిన సిబ్బందిపై కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో మూడు రోజుల కిందట ఆయనకు రిజిస్ట్రార్ మల్లారెడ్డి మెమో జారీ చేసి, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా టైం ఇచ్చారు. దాని ప్రకారం సోమవారం సాయంత్రానికి ఆ గడువు ముగిసింది. దీంతో ఇన్​చార్జి వీసీ దృష్టికి తీసుకెళ్లి ఏఆర్ అశోక్​ బాబుపై యాక్షన్​ తీసుకునేందుకు వర్సిటీ అధికారులు రెడీ అవుతున్నారు.

వర్సిటీ కబ్జాల వ్యవహారంలో కూడా మున్సిపల్ ఆఫీసర్ల తీరును కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. మంగళవారం కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి, ఇతర అధికారులు ఇన్​చార్జి వీసీని హైదరాబాద్​లో సమావేశం కానున్నారు. ఇదిలాఉంటే వర్సిటీ ల్యాండ్ ఆక్రమణల విషయంలో మున్సిపల్​ ఆఫీసర్లు కూడా త్వరగా యాక్షన్​ తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.