కేయూ బడ్జెట్ ​రూ.389.53 కోట్లు

  • సగానికిపైగా జీతాలు, పింఛన్లకే కేటాయింపు
  • పరీక్షలు, అకడమిక్​ ఫీజులతో స్టూడెంట్లపై రూ.65.62 కోట్ల భారం

హనుమకొండ/ కేయూ క్యాంపస్, వెలుగు: 2023–24 ఆర్థిక సంవత్సరానికి కాకతీయ యూనివర్సిటీ బడ్జెట్​ను రూ.389.53 కోట్లతో ప్రతిపాదించారు. కేయూ వీసీ ప్రొఫెసర్​తాటికొండ రమేశ్​ అధ్యక్షతన క్యాంపస్​లోని సెనెట్ హాలులో మంగళవారం జరిగిన 38వ అకడమిక్ సెనెట్ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొ. శ్రీనివాసరావు బడ్జెట్​ను ప్రవేశపెట్టగా.. అకడమిక్​సెనెట్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఏడాదిపాటు ఉద్యోగుల వేతనాలు, రిటైర్డ్​ ఎంప్లాయీస్​ పింఛన్లు, రిటైర్​మెంట్ ​బెనిఫిట్స్, ఇతర ఖర్చులకు బడ్జెట్​లో సగానికంటే ఎక్కువగా రూ.209.03 కోట్లు కేటాయించారు. వివిధ అభివృద్ధి పనులకు రూ.16 కోట్లు, ఇతర అకడమిక్, పరీక్షలు, స్టూడెంట్లకు వసతులు, ఇతర అవసరాల కోసం రూ.164.50 కోట్లు ప్రతిపాదించారు. 

మొత్తం బడ్జెట్​లో రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ అంతర్గత వనరుల ద్వారా రూ.370.75 కోట్లు రాబడి వస్తుందని అంచనా వేశారు. వీటిలో  రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్ రూపంలో రూ.127.50 కోట్లు, యూజీసీ పీఆర్సీ ఏరియర్స్  రూ.32.81 కోట్లు, అంతర్గత నిధులు ముఖ్యంగా పరీక్షల విభాగం, అకడమిక్ ఫీజులు రూ.65.62 కోట్లు ఉండగా.. ఇతర వనరుల నుంచి 144.82  కోట్లు అంచనా వేశారు.  రూ.15.47 కోట్లు లోటు చూపారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ తాటికొండ రమేశ్​ మాట్లాడుతూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నుంచి కొత్తగా రెండు బాలికల హాస్టళ్ల నిర్మాణానికి రూ.20 కోట్ల మంజూరైనట్లు తెలిపారు. పోతన హాస్టల్ ను బాలికలకు కేటాయించామన్నారు. కొత్తగూడెం ఇంజినీరింగ్ కాలేజీని రూ.1.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. టీఎస్​ జెన్ కో  నుంచి రూ.కోటి నిధులతో ఇంటర్నల్​ రోడ్లు వెడల్పు చేస్తున్నామన్నారు. రిజిస్ట్రార్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ  దూర విద్య కేంద్రంలో నూతన కోర్సులు ప్రారంభిస్తామన్నారు. పూర్వ విద్యార్థుల సంఘాల నుంచి, ఇతర మార్గాల నుంచి నిధులు సేకరించి లోటు పూరిస్తామన్నారు.