జాబ్ నోటిఫికేషన్లు రావట్లేదని వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నం చేసి... నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్ధి సునీల్ చనిపోయాడు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందిన బోడ సునీల్ అనే యువకుడు మార్చి 26న కాకతీయ యూనివర్సిటీలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన తోటి విద్యార్ధులు వెంటనే ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. వారం రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సునీల్.. శుక్రవారం ఉదయం కన్నుమూశాడు.
సునీల్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియోను రికార్డు చేశాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సినోడిని ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. విద్యార్ధులు ముఖ్యమంత్రిని విడిచిపెట్టొద్దని చెప్పాడు. తెలంగాణ వచ్చి ఏడేళ్లైనా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారని... వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియచేసేందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన సునీల్ చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. 2016లో ఎస్సై పరీక్షలు రాసి క్వాలిఫై కూడా అయ్యాడు. అయితే ఫిజికల్ టెస్టులో హైట్ తక్కువగా ఉన్న కారణంగా ఉద్యోగంలోకి తీసుకోలేదు. అప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి... విసిగిపోయిన సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడు.