రగులుతున్న..పీహెచ్​డీ టెన్షన్​

  •     అక్రమాలపై నెల రోజులుగా కేయూ స్టూడెంట్ల ఆందోళన
  •     ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోవడంతో లీడర్ల తీరుపై తీవ్ర అసహనం
  •     ఇదే నెలలో మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ వరంగల్ టూర్
  •     పెద్ద ఎత్తున నిరసన తెలిపే యోచనలో స్టూడెంట్లు

హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ పీహెచ్​డీ అడ్మిషన్ల లొల్లి ఇంకా చల్లారడం లేదు. పీహెచ్​డీ సీట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ కేయూ విద్యార్థులు నెల రోజులుగా నిరసన ప్రదర్శనలు, దీక్షలు కొనసాగిస్తుండగా ఇంత వరకూ ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. దీంతో వర్సిటీ విద్యార్థులు ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే  గురువారం మంత్రి కేటీఆర్​, ఆ తరువాత సీఎం కేసీఆర్​ వరంగల్​ పర్యటనకు రానుండటంతో విద్యార్థులు, వివిధ సంఘాల నేతలు వారి పర్యటనను అడ్డుకునే  యోచనలో ఉన్నారు.

కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్​డీ కేటగిరి-2 అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ గత నెల 5 నుంచి స్టూడెంట్​ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అంతకుముందు వరంగల్​ విద్యార్థులను, స్టూడెంట్  లీడర్లను పోలీసులు అరెస్టు​ చేశారు. ఈ క్రమంలో లాఠీలు ఝుళిపించడంతో విద్యార్థులకు గాయాలు కాగా.. అప్పటి నుంచి కేయూ క్యాంపస్​లో విద్యార్థులు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. వివిధ ప్రజా సంఘాలు, పార్టీల నేతలు వారి దీక్షకు మద్దతు తెలిపారు.

స్టూడెంట్లు దీక్ష చేపట్టి నెల రోజులవుతున్నా ఇంత వరకు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర లీడర్లు ఎవరూ పట్టించుకున్నది లేదు. కేటీఆర్, కేసీఆర్ పర్యటనలను స్టూడెంట్లు అడ్డుకునే అవకాశం ఉండడంతో చివరికి వరంగల్  సీపీ రంగనాథ్  రంగంలోకి దిగారు. ఇటు విద్యార్థులు, అటు వీసీ తాటికొండ రమేశ్​తో సీపీ చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే గత నెల 11న పోలీసుల సమక్షంలో వీసీ తాటికొండ రమేశ్, విద్యార్థి సంఘాల నేతలతో మీటింగ్​ ఏర్పాటు చేసి మాట్లాడారు.

సమస్య కొలిక్కిరాకపోవడంతో అదే నెల  23న  కేయూ విద్యార్థి సంఘాల నేతలు,  ప్రొఫెసర్లతో సీపీ రంగనాథ్​ సమావేశం అయ్యారు. అటు స్టూడెంట్లు, ఇటు వీసీ మధ్య ఆయన వారధిగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థులు తమ డిమాండ్లతో పాటు పీహెచ్​డీ అక్రమాలకు సంబంధించిన 84 పేజీల బుక్​ లెట్​ను సీపీకి అందించారు.

మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ ఇస్తారా?

ఈనెల 6న మంత్రి కేటీఆర్​ వరంగల్​ నగరంలో పర్యటించనున్నారు. ఆ తరువాత ఈనెల 16న సీఎం కేసీఆర్​  కూడా వరంగల్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్​ చేస్తున్నారు. అదే రోజు ఎన్నికల మేనిఫెస్టోను సీఎం ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్  పర్యటనలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి, తమ గోడును వెళ్లబోసుకోవాలనే యోచనలో పీహెచ్ డీ అభ్యర్థులు ఉన్నారు. దీంతో అధికార పార్టీ నేతలతో పాటు ఆఫీసర్లలోనూ టెన్షన్​ మొదలైంది. ఎలాగోలా విద్యార్థుల గొడవను సద్దుమణిగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు సార్లు ఆఫీసర్లు మీటింగులు నిర్వహించి చర్చలు జరిపినా.. ఫలితం లేకపోవడంతో ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు.

ఈనెల 6లోగా సమస్య పరిష్కారం కాకపోతే మంత్రి కేటీఆర్​ పర్యటన రోజున విద్యార్థులను నేరుగా ఆయనను  కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మంత్రి కేటీఆర్​ నుంచి ఏదైనా ఒక స్పష్టమైన హామీ వస్తే.. ఆ తరువాత తమ కార్యాచరణ ఏమిటో ప్రకటిస్తామని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. వాస్తవానికి పీహెచ్​డీ అడ్మిషన్ల గొడవ పరిష్కారం కావాలంటే పాలక మండలి ఆమోదంతో సీట్లు పెంచాలి. కానీ, పీహెచ్ డీ ప్రవేశాల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకునే వరకు ఆందోళనలు విరమించేది లేదని విద్యార్థులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతోనే మంత్రుల పర్యటనపై ప్రభావం పడకుండా ఆఫీసర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.