
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
- కిలోమీటరున్నర మేర నరకం
- పడిపోయిన బిజినెస్
వరంగల్, వెలుగు: హనుమకొండలోని కేయూసీ 100 ఫీట్ల రోడ్డు.. ఏడాది నుంచి ప్రయాణికులకు, స్థానికులకు చుక్కలు చూపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేని తనంతో దాదాపు కిలోమీటరున్నర మేర నరకప్రాయం అయింది. మూడు నెలల్లో పూర్తి చేస్తామని రోడ్డును బ్లాక్ చేసిన ఆఫీసర్లు.. ఏడాది దాటినా పనులు పూర్తి చేయడం లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గతంలో 5 నిమిషాల్లో ఈ రోడ్డు దాటే ప్రజలు.. ఇప్పుడు గల్లీలు తిరుగుతూ.. అరగంట పాటు ప్రయాణం చేయాల్సి వస్తోంది. పనుల వల్ల గోపాల్‍పూర్ జంక్షన్ నుంచి జవహర్ నగర్ జంక్షన్ వరకు ఉండే ఇండ్లు, షాపులు దుమ్మూదూళితో నిండిపోతున్నాయి. బిజినెస్‍లు దెబ్బతింటున్నాయి.
రూ.54కోట్ల స్మార్ట్ సిటీ ఫండ్స్..
ఏటా వానాకాలంలో గ్రేటర్ వరంగల్ కాలనీలు మునుగుతున్నాయి. హనుమకొండలో గోపాల్‍పూర్ పైభాగం నుంచి వచ్చే వరద ఎక్కువగా ఉంటోంది. నాలాల ఆక్రమణతో నీరంతా సమ్మయ్యనగర్, నయీంనగర్, పోచమ్మకుంట వంటి లోతట్టు కాలనీల్లోకి చేరుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, వరద నీరు ఈజీగా వెళ్లడానికి గోపాల్‍పూర్ ఊర చెరువు నుంచి సమ్మయ్యనగర్ ప్రెసిడెన్సీ స్కూల్ వరకు 1.4 కిలోమీటర్ల దూరం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కండక్ట్ వర్క్స్ చేపట్టారు. కేంద్రం స్మార్ట్ సిటీ స్కీం కింద రూ.54 కోట్లు కేటాయించింది. కానీ పనులు సకాలంలో పూర్తి చేయడంలో లీడర్లు, బల్దియా ఆఫీసర్లు ఫెయిల్ అవుతున్నారు. దీంతో రెగ్యులర్ డ్యూటీలు, స్కూళ్లు, కాలేజీలు, వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లకు వెళ్లే వందలాది కాలనీల జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఏడాది దాటింది..
కేయూ వంద ఫీట్ల రోడ్డు పనులు 2021లోనే పూర్తి చేయాల్సి ఉండగా.. అధికారుల అలసత్వం కారణంగా.. 2022 ఫిబ్రవరిలో పనులు షురూ అయ్యాయి. ఈ రూట్ లో రద్దీ ఎక్కువగా ఉండడంతో 3నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఏడాది దాటినా పనులు పూర్తి కాలేదు. దీంతో కాజీపేట నుంచి వంద ఫీట్ల రోడ్ మీదుగా కరీంనగర్ మెయిన్ రోడ్ కు చేరుకోవాల్సిన వాహనాలు.. వడ్డేపల్లి చర్చి నుంచి జవహర్‍కాలనీ, మారుతీ నగర్, గోపాల్‍పూర్ కల్లు మండువా, గ్రామ పంచాయతీ మీదుగా తిరుగు ప్రయాణం సాగిస్తున్నాయి.
స్థానికులకు తిప్పలు..
రోడ్డు పనులు నెమ్మదిగా సాగుతుండడతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిత్యం లారీల రాకపోకలతో ఇండ్లు, షాపులపై దుమ్మూధూళి ఆవరించింది.
బట్టలు బయట ఆరేయలేని దుస్థితి. ఇళ్లముందు వాహనాలు కూడా దుమ్ము పట్టిపోయాయి. లోతుగా గుంతలు తవ్వడంతో సమ్మయ్య నగర్, టీవీ టవర్ కాలనీ, కేయూ, అమరావతి నగర్, వాంబే కాలనీ, ఆదర్శ నగర్, గోపాల్‍పూర్ చుట్టూరా ఉండే కాలనీల జనాలు, స్కూళ్లకు వెళ్లే చిన్నారులు బిక్కుబిక్కుమంటూ రోడ్డు దాటుతున్నారు. ఈ రూట్లో గతంలో వందలాది షాపులు, చిరు వ్యాపారులు బిజినెస్ చేసుకునేవారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కొందరికి ఏడాది పాటు కిరాయిలు మీదపడ్డాయి. రెంట్ల కోసం కూడా రావడం లేదు. ఇకనైనా లోకల్ లీడర్లు, గ్రేటర్ అధికారులు పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
భయంభయంగా వెళ్తున్నం
ఏడాది నుంచి రోడ్డంతా ఎక్కడపడితే అక్కడ 20 ఫీట్ల లోతు తవ్వుతున్నారు. ఎక్కడ పని నడస్తుందో.. ఎక్కడ ఆపారో తెలియడంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సైడ్ నుంచి భయంభయంగా నడుచుకుంటూ వెళుతున్నాం.
- మీసాల రమేశ్ (స్థానికులు)
ఎవరూ పట్టించుకోవట్లే..పనులు ప్రారంభించేటప్పుడు
3 నెలల్లోనే పూర్తి చేస్తాం. ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పిన అధికారులు ఏడాది అవుతున్నా కంప్లీట్ చేయట్లేదు. అప్పుడెప్పుడో తప్పించి పనులు చూసేందుకు లీడర్లు ఇటుసైడు రాలే. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావట్లేదు. ఎవరూ పట్టించుకోవట్లేదు.
– దశరథం (అమరావతి నగర్)