- వేలం అయిన వెంటనే రోడ్లు, నీళ్లు, కరెంట్ ఇస్తామన్న ఆఫీసర్లు
- ప్రైవేట్ వెంచర్ల కన్నా మూడింతలు వసూలు.. అయినా కనిపించని సౌకర్యాలు
- లక్షలు పోసి కొన్నా ఇండ్లు కట్టుకోలేకపోతున్నామంటున్న ప్రజలు
వరంగల్‌లో మూడు వెంచర్లు చేసిన కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
వరంగల్, వెలుగు: రూ. లక్షలు పోసి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వద్ద కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇల్లు కట్టుకుందామన్న ప్రజల ఆశలు ఏండ్లు గడుస్తున్నా తీరడం లేదు. వేలం ముగియగానే అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ ప్రైవేట్ వెంచర్ల కన్నా ఎక్కువ రేటు వసూలు చేసిన కుడా ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది. దీంతో వెంచర్లు అడవిని తలపిస్తున్నాయి. కనీస వసతులు కూడా లేకపోవడంతో వెంచర్లలో ఇండ్లు కట్టుకోలేకపోతున్నామని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా...
జీడబ్ల్యూఎంసీ మాదిరిగానే సొంత ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా కుడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు టర్మ్‌లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్ నగరానికి దగ్గర్లో ఉన్న భూములను గుర్తించి కుడా ఆధ్వర్యంలో వెంచర్లు వేసి జనాలకు ప్లాట్లు అమ్మింది. మొదటి ప్రాజెక్ట్‌కు ఓరుగల్లు పేరు వచ్చేలా వరంగల్ అజాంజాహి మిల్ ప్రాంతంలో ‘ఓ సిటీ’ పేరుతో వెంచర్ చేసింది. ఆ తర్వాత హనుమకొండ మడిపల్లి వద్ద ‘మా సిటీ’ పేరున మరో వెంచర్ చేసింది.
మూడో ప్రాజెక్ట్‌గా గతేడాది ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉండే ఉనికిచర్ల వద్ద ‘ఉని సిటీ’ పేరుతో వెంచర్ డెవలప్‌చేసింది. వేలం పాట ముగిసిన వెంటనే రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, మంచినీరు, కరెంట్, పార్క్‌లు, గుడులు, బడులు, బస్సు ఫెసిలిటీతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ వెంచర్ కావడంతో కొనుగోలు కోసం వచ్చిన ప్రజల మధ్యే పోటీ పెట్టి ప్రైవేట్ వెంచర్ల కంటే ఎక్కువ ధర వసూలు చేసింది. తీరా చూస్తే వేలం ముగిసి ఐదారేండ్లు అవుతున్నా రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్, మంచినీటి సరఫరా వ్యవస్థ రాలేదు.
‘ఓ సిటీ’లో గజం రూ.లక్షకు అమ్మిన్రు
బీఆర్‌ఎస్ ఏర్పడిన తర్వాత 2016 నుంచి కుడా చైర్మన్‌గా మర్రి యాదవరెడ్డి వ్యవహరించారు. వరంగల్ రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండే అజాంజాహి మిల్ ఏరియాను ఆనుకుని ‘ఓ సిటీ’ టౌన్ షిప్ పేరుతో వెంచర్ చేశారు. ప్రైమ్ లొకేషన్‌లో 117 ఎకరాల్లో 835 ప్లాట్లు డెవలప్ చేశారు. 11 ఫేజ్‌లలో ప్లాట్లను వేలం వేయనున్నట్లు తెలిపారు. కాగా 2016 సమయంలో గజం ధర రూ.15 వేలు పలుకగా, గతేడాది ఇదే వెంచర్‌లో గజం భూమి రూ.లక్ష పలికింది. అయినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించలేదు.
‘మా సిటీ’ పేరున రియల్ వ్యాపారులతో ములాఖత్
హనుమకొండ సిటీకి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే మడిపల్లి మార్గంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు పదేళ్ల క్రితమే వెంచర్లు చేశాయి. సిటీ నుంచి రోడ్లు, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో అక్కడ గజం ధర రూ. 2 నుంచి 3 వేలకు మించి లేదు. ఈ క్రమంలో ‘కుడా’ పెద్దలు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ములాఖత్ అయ్యారు. ప్రైవేట్ వెంచర్ల అవతల ‘మా సిటీ’ పేరుతో 2018– 19లో టౌన్‌షిప్ ప్లాన్ చేశారు. ప్రజల డబ్బులతో హనుమకొండ నుంచి ప్రైవేట్ వెంచర్ల మీదుగా మా సిటీ వరకు డబుల్ రోడ్డు వేసి, డివైడర్లు, లైటింగ్ ఏర్పాటు చేశారు. 300 ఎకరాల్లో 2 వేల ప్లాట్లు ఉంటాయని చెప్పి మొదటి దఫాలో 80 ప్లాట్లు మాత్రమే అమ్ముతున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ వెంచర్‌లో ఆకర్షణీయమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు, 24 గంటల వాటర్ ఫెసిలిటీ, ట్రాన్స్‌పోర్ట్ అంటూ మాటలు చెప్పారు. ఈ ఏరియాలో అప్పటికి గజం రూ.3 వేలు పలుకుతుండగా ప్రైవేట్ వ్యాపారులను వేలంలో పాల్గొనేలా చేసి ప్రజలకు రూ. 8 వేలకు గజం చొప్పున అమ్మారు. దీంతో ప్రైవేట్ రియల్ వ్యాపారులు సైతం తమ వెంచర్లలో గజం రేటును రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. కుడా చైర్మన్‌గా సుందర్ రాజ్ వచ్చాక అయ్యాక 2022 నవంబర్13న రెండో దఫాలో 98 ప్లాట్లకు వేలం నిర్వహించారు.
ఈ సారి గజం ధర రూ.8 వేలుగా నిర్ణయించి యావరేజీన రూ.17 వేలకు గజం చొప్పున అమ్మారు. దీంతో ప్రైవేట్ వ్యాపారులు మరోసారి తమ ధరలను రూ.18 వేల నుంచి రూ. 20 వేలకు పెంచేశారు. తీరా చూస్తే వెంచర్‌లో రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్, వాటర్ ఏ ఒక్కటీ కనిపించకపోవడంతో వెంచర్ మొత్తం అడవిలా మారింది.
రూ. 23 వేలు పెట్టినా ‘ఉని సిటీ’దీ అదే పరిస్థితి
ఓ సిటీ, మా సిటీ వెంచర్లలో సౌకర్యాలు పక్కనపెట్టిన కుడా పెద్దలు.. మూడో సారి హనుమకొండ సిటీ నుంచి వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు ఉనికిచర్ల వద్ద ‘ఉని సిటీ’ పేరుతో గతేడాది 135 ఎకరాల స్థలంలో వెంచర్ స్టార్ట్ చేశారు. మొదటి దఫా 10 ఎకరాల్లో 56 ప్లాట్లు వేలం వేశారు. గజం ధరను రూ.12 వేలుగా నిర్ణయించగా.. రియల్ వ్యాపారులు వేలంలో పాల్గొని ధరలు పెంచేలా చేసి గజం రూ.23,300 చొప్పున విక్రయించారు. ఇక్కడ కూడా ఇప్పటివరకు కనీస సౌలత్‌లు కనిపించడం లేదు. దీంతో ‘కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’పై నమ్మకంతో రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షలు పెట్టి ప్లాట్లు కొన్న ప్రజలు ఇండ్లు నిర్మించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
రూ.47 లక్షలు పెట్టినా ఇల్లు కట్టుకోలేకపోతున్నా..
మా పిల్లలు జాబ్ కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు. వరంగల్ సిటీలో ఇల్లు కట్టుకోవడం కోసం జాగా చూడమన్నారు. గజం రూ.10 వేల నుంచి రూ. 12 వేలు పలికే ఉనికిచర్ల ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఉని సిటీలో రూ.23 వేలకు గజం చొప్పున రూ.47 లక్షలు పెట్టి 200 గజాలు తీసుకున్నా. రెండు నెలల్లోనే రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పైపులు, కరెంట్ వస్తుందని చెప్పిన్రు. ఏడాదవుతున్నా అవేవీ రాలేదు. సొంతింటి కల నెరవేరలేదు. కొత్త ప్రభుత్వంలో అయినా ఫెసిలిటీస్ కల్పించాలే. -ఎన్.రాజలింగం, వరంగల్